"డీజే టిల్లు" రాధిక "బెదురులంక" తో హిట్ కొడుతుందా ?

VAMSI
కన్నడ భామ నేహశెట్టి గురించి డీజే టిల్లు వరకు అంతగా తెలియదనే చెప్పాలి. కానీ డీజే టిల్లు కన్నా ముందు ఈమె టాలీవుడ్ లో సినీ రంగ ప్రవేశం చేసి రెండు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొదటి సినిమా టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరున్న పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా చేసిన మెహబూబా సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తరువాత కొంత గ్యాప్ తో సందీప్ కిషన్ హీరోగా చేసిన గల్లీ రౌడీ లో నటించింది.. కామెడీ టచ్ తో సినిమా బాగున్నప్పటికీ ఎందుకో కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.
అలా చేసిన రెండు సినిమాలు నేహా శెట్టికి చేదు ఫలితాన్ని మిగిల్చాయి. ఇక ఈమె కెరీర్ లో ముందుకు వెళ్లడం కష్టం అనుకుంటున్న తరుణంలో టాలెంటెడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన "డీజే టిల్లు" లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది, ముఖ్యంగా ఇందులో నేహా శెట్టి రాధిక అన్న పాత్రలో టిల్లును అమాయకంగా నటించి మోసం చేసి ఆకట్టుకుంది. దీనితో నేహా శెట్టికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. దానితో ఈమెకు వరుసగా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. అయితే ఈమె ప్రస్తుతం యువహీరో కార్తికేయ నటిస్తున్న "బెదురులంక 2012" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా యుగాంతం నేపథ్యంలో తెరకెక్కుతోంది, కార్తికేయ అల్ట్రా మోడరన్ యువకుడిగా నటిస్తుండగా నేహా శెట్టి క్లాసికల్ యువతిగా తన పాత్రను పోషించనుంది. ఈ సినిమాకు మ్యూజిక్ లెజెండ్ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి కాన్సెప్ట్ గా కొత్తగా ఉండడం , నేహా శెట్టికి అదృష్టం కలిసి వస్తుండడం వంటి కారణాల వలన ఈ సినిమా కూడా తనకు హిట్ ను అందిస్తుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: