అమ్మూ.. గృహహింసపై సందేశం..!!

murali krishna
భార్య మీద చేయి చేసుకునే భర్తలు ఈ సమాజంలో ఉన్నారు. భర్త వేధింపులను భరించే భార్యలూ ఉన్నారు. వాళ్లకు సందేశం ఇచ్చే సినిమా 'అమ్ము'.గృహహింస ఎంతగా పెరిగిపోయిందో చెప్పలేం.. దీనికోసం డొమెస్టిక్‌ వయలెన్స్‌ చట్టాలూ ఉన్నాయి. అయినా నేటికీ అనేకమంది మహిళలు నాలుగుగోడల మధ్య జరిగే గృహహింసకు బలవుతూనే ఉన్నారు. ఇలా ఎన్నాళ్లు ? ఎన్నేళ్లు ? ప్రతి స్త్రీ ఆలోచించాల్సిన విషయం. చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా ? ఐశ్వర్యలక్ష్మీ ఈ సినిమాలో ఏం చేసింది ? అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 19న విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది ? కథేంటి ? తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.దర్శకుడు : చారుకేశ్‌ శేఖర్‌ నటీనటులు : ఐశ్వర్య లక్ష్మీ, నవీన్‌ చంద్ర, బాబీ సింహ, సత్య కృష్ణన్‌, ప్రేమ్‌ సాగర్‌, రఘుబాబు, అంజలి అమీర్‌, రాజా రవీంద్ర, అప్పాజీ అంబరీష తదితరులు
మాటలు: పద్మావతి మల్లాది
ఛాయాగ్రహణం : అపూర్వ అనిల్‌ శాలిగ్రాం
సంగీతం : భరత్‌ శంకర్‌
క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ : కార్తీక్‌ సుబ్బరాజ్‌
నిర్మాతలు : కళ్యాణ్‌ సుబ్రమణియన్‌, కార్తికేయన్‌ సంతానం
రచన, దర్శకత్వం : చారుకేశ్‌ శేఖర్‌
విడుదల తేదీ : అక్టోబర్‌ 19, 2022
ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కథలోకి వెళ్తే.. రవి... రవీంద్రనాథ్‌ (నవీన్‌ చంద్ర) పోలీస్‌ అధికారి. ఓ ఎస్సై. అమ్ము... అముద (ఐశ్వర్య లక్ష్మీ) అతడి పొరుగింటి అమ్మాయి. పెద్దలు ఇద్దరితో ఏడడుగులు వేయిస్తారు. పెళ్ళైన కొత్తలో అంతా బావుంటుంది. భార్యను రవి చాలా బాగా చూసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత అతడి అసలు మనస్తత్వం బయటపడుతుంది. చిన్న చిన్న విషయాలకే భార్యపై కోప్పడటం, కొట్టడం మొదలుపెడతాడు. భర్తను వదిలి, ఇల్లు విడిచి వెళ్లిపోవాలని అమ్ము అనేకసార్లు అనుకుంటుంది. కానీ, వెళ్ళలేదు. తనను చిత్రహింసలకు గురి చేస్తున్న భర్తను భరించక తప్పదనుకుని సర్దుకుపోయిందా? లేదంటే ఏమైనా చేసిందా? రవి, అమ్ము దంపతుల మధ్యలోకి పెరోల్‌ మీద బయటకొచ్చిన హంతకుడు ప్రభు (బాబీ సింహ) ఎలా వచ్చాడు? తర్వాత ఏమైంది? అనేది మిగతా కథ.
గృహహింస.. గురించి ఏ భాషలో చెప్పినా భావం ఒక్కటే! ఈ అంశం మీద గతంలో హిందీలో తాప్సీ 'థప్పడ్‌', ఆలియా భట్‌ 'డార్లింగ్స్‌' చిత్రాలు వచ్చాయి. తెలుగులో గృహహింస నేపథ్యంలో కొన్ని చిత్రాల్లో సన్నివేశాలు ఉన్నాయి. అయితే... గృహహింస ప్రధానాంశంగా రూపొందిన చిత్రం 'అమ్ము' అని చెప్పాలి.
'మొగుడు అన్నాక కొడతాడు... భార్య భరించాలి, సర్దుకుపోవాలి' మన సమాజంలో తరతరాల నుంచి నాటుకుపోయిన భావన ఇది. 'ఒక మగాడు పెళ్ళాం మీద చెయ్యి ఎత్తకూడదు. అలా ఎత్తాడే అనుకో... వాడితో ఒక్క క్షణం కూడా పెళ్ళాం ఉండాల్సిన అవసరం లేదు' ఇదీ 'అమ్ము'లో అమ్మాయితో తల్లి చెప్పే మాట! ఈ డైలాగ్స్‌ సినిమాలో హైలెట్‌..
అయితే తల్లి మాట విని భర్త కొట్టిన వెంటనే, బ్యాగ్‌ సర్దుకుని, అమ్మాయి వచ్చేస్తే 'అమ్ము' కథ అరగంటలో సినిమా ముగిసేది. కథలో అసలు విషయం ఇదేనని తెలిసిన తర్వాత చూసేటప్పుడు ఆసక్తి ఏముంటుంది? అనుకునే వీక్షకులూ ఉండొచ్చు. కానీ 'అమ్ము'లో అసలు విషయం కంటే మించి బలమైన సంఘర్షణ ఉంది. అది మనల్ని చివరి వరకూ సినిమా చూసేలా చేస్తుంది.
అమ్మ మాట విని ఆడపిల్ల బ్యాగ్‌ సర్దుకుని వచ్చేయడం అంత సులభం కాదనే విషయాన్ని 'అమ్ము'లో చూపించారు. అందుకు ఎన్నో అడ్డంకులు! ఇలాంటి సన్నివేశాలు మన చుట్టూ ఎన్నో. కొన్నిసార్లు భర్తకు భార్య భయపడితే... కొన్నిసార్లు బంధాన్ని నిలుపుకోవాలనే ఆలోచన, ప్రేమఅడ్డుగోడలు అవుతాయని సూటిగా, స్పష్టంగా చెప్పారు. అసలు విషయం చెప్పే క్రమంలో దర్శకుడు కొంత స్వేచ్ఛ తీసుకున్నారు.
రవి పాత్రలో ఒక్కసారిగా వచ్చే మార్పు ఆశ్చర్యానికి గురి చేస్తే... పోలీసుల కళ్ళు గప్పి, హంతకుడిని దాచడం అంత సులభమా? అనిపిస్తుంది. కథకు అనుకూలంగా కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాసుకున్నారు. అవి పంటి కింద రాయిలా తగులుతాయి. భార్యను కొట్టి తర్వాత సారీ చెప్పి, మళ్లీ కొట్టే రవి లాంటి పాత్రలను ఇంతకు ముందు చూశాం కూడా ! 'డార్లింగ్స్‌'లో విజరువర్మ పాత్ర కూడా అలానే ఉంటుంది. అయితే.. అమ్ము పాత్రను మలచిన విధానం కొత్తగా ఉంది. కథను ఆసక్తిగా ప్రారంభించిన దర్శకుడు.. మొదటి గంట తర్వాత కొన్ని తప్పటడుగులు వేశారు. బాబీ సింహ పాత్ర, జైలు బయట అతని కోసం ధర్నా చేసే సన్నివేశాలు కథను కొంత సైడ్‌ ట్రాక్‌లోకి తీసుకువెళ్లాయి. నిడివి పెంచాయి. మళ్ళీ ముగింపులో మెరుపు చూపించారు. కథ, కథనం కంటే కథలో అమ్ము పాత్ర తాలూకు సంఘర్షణ, సంభాషణలు ఎక్కువ ఆకట్టుకుంటాయి. కథతో ప్రయాణించేలా చేస్తాయి.
అమ్ము పాత్రలో ఐశ్వర్యలక్ష్మీ జీవించారు. ఇక నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్లను ఇంతకు ముందు నవీన్‌చంద్ర చేశారు. అయితే పతాక సన్నివేశాల్లో నవీన్‌చంద్ర ఎక్స్‌ప్రెషన్‌ నటుడిగా మరో మెట్టు ఎక్కించింది. బాబీ సింహ, ప్రేమ్‌సాగర్‌, సత్య కృష్ణన్‌, సంజరు స్వరూప్‌ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. రఘుబాబు కనిపించేది రెండు సన్నివేశాల్లోనే అయినప్పటికీ.. కథలో కీలక పాత్ర చేశారు. స్టేషన్‌కు అనేకమంది ఆడపిల్లలు ఈ గృహహింస తట్టుకోలేక రావడం ఎంత పరిపాటో ఆ సన్నివేశం ఎలాంటిమాటలు లేకుండా అర్థమయ్యేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: