' మా ' గొడవలు మళ్ళీ గెలికిన నాగబాబు...!!

murali krishna
గత ఏడాది జరిగిన మా అధ్యక్ష ఎన్నికలు ఎంత రసాభాసాకు దారితీశాయో తెలిసిన విషయమే. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ వర్గానికి చెందిన నాగబాబుకు మంచు విష్ణు వర్గపు నరేష్ కి మాటల యుద్ధం నడిచింది. అది హద్దులు దాటి వ్యక్తిగత ఆరోపణల వరకూ వెళ్ళింది. ఎన్నికలతో ముగిసిన ఈ వివాదాన్ని నాగబాబు మరలా తెరపైకి తెచ్చారు. ప్రస్తుత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) అధ్యక్షుడు మంచు విష్ణు కాగా.. ఆయనకు ముందు నరేష్ ఆ బాధ్యతలు నిర్వర్తించారు. నరేష్ పదవీకాలం ముగియడంతో 2021 అక్టోబర్ లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. మాజీ అధ్యక్షుడు నరేష్ మంచు విష్ణుకు మద్దతుగా నిలిచారు. మరో అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్ రాజ్ కి నాగబాబు మద్దతు ప్రకటించారు. ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు ప్రత్యర్థుల మధ్య ఆవేశాలు రగిలించాయి. ముఖ్యంగా నాగబాబు, నరేష్ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లారు. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని మాట్లాడిన వారిపై నాగబాబు ఫైర్ అయ్యారు. కోటా శ్రీనివాసరావుని నాగబాబు వాడు ఎప్పుడు చనిపోతాడో కూడా తెలియదు అనడం సంచలనం రేపింది.
ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ పరువు నాగబాబు, నరేష్, జీవిత, హేమ, బండ్ల గణేష్ ఇంకా కొందరు కలిసి బజారుకీడ్చారు. ఎన్నికల తర్వాత కూడా గొడవలు ఆగలేదు. మంచు విష్ణు విజయాన్ని ప్రకాష్ రాజ్ అంగీకరించలేదు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచిన సభ్యులు రాజీనామా చేశారు. మంచు విష్ణు పనితీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రశ్నిస్తామని ప్రకాష్ రాజ్ హెచ్చరించారు.
తాజాగా మంచు విష్ణు విజయంలో కీలక పాత్ర వహించిన నరేష్ ని ఉద్దేశిస్తూ నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. నాగబాబు మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చరిత్రలో నరేష్ అంతటి చేతకాని, లిటిగేషన్ ప్రెసిడెంట్ మరొకరు లేరు. అతను మా అసోసియేషన్ కి మేలు చేయకపోగా కీడు చేశాడు. మా లోని ప్రతి విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పేవాడు. ప్రజలకు మా లో జరిగే విషయాలు అవసరం లేదు. దాని వలన మేము స్పందించాల్సి వచ్చింది.
 

ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం మోహన్ బాబు, విష్ణుకు లేదు. ప్రకాష్ రాజ్ గురించి నరేష్ తప్పుగా చెప్పడం వలనే వారు మాట్లాడారని తెలిసింది. తానో దైవాంశ సంభూతుడిలా ఫీల్ అవుతాడు. అందుకే ఎన్నికల్లో శ్రీకృష్ణుడు పాత్ర వహించాడు. అతనికి అదో రకం మానసిక జబ్బు. నరేష్ కి ఇతరులను గౌరవించడం తెలియదు. శివాజీ రాజాతో గొడవపడ్డాడు. జీవిత రాజశేఖర్ కి దగ్గరయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఆమెతో గొడవపడుతున్నాడు. మా సభ్యుల మధ్య గొడవలు పెట్టి తాను పరిశ్రమకు పెద్ద దిక్కు కావాలి అనుకున్నాడని... అన్నారు.
 
నాగబాబు నరేష్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఎవరైనా తనను విమర్శిస్తే నరేష్ వెంటనే రియాక్ట్ అవుతారు. ఈ క్రమంలో నరేష్ నాగబాబుకు ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: