రాజేంద్రప్రసాద్ 'అనుకోని ప్రయాణం' రివ్యూ....!

murali krishna
నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ సోలోగా సినిమాలు చేయటం దాదాపు తగ్గిపోయింది. అయితే అప్పుడప్పుడూ నిర్మాతలు, దర్శకులు ధైర్యం చేస్తున్నారు. ఆ క్రమంలో వచ్చిన చిత్రమే 'అనుకోని ప్రయాణం'.చాలా రోజుల తర్వాత పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు డైలాగ్స్ రాశారు. ఎలాంటి అంచనాలు లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం.. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ కొద్దిపాటి ఆసక్తిని కలిగించింది. జీవితం, దాని చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్ నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా కథేంటి...సినిమా చూడదగినదేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీలైన్ :
భువనేశ్వర్ లోని ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో రోజువారీ కూలీలుగా పనిచేసే రాజేంద్ర ప్రసాద్ మరియు నరసింహ రాజు లు మంచి ప్రెండ్స్. రాజేంద్ర ప్రసాద్ కి బంధాలు,అనుబంధాలు పై ఎలాంటి నమ్మకం ఉండదు. తనేంటో,తన పని ఏంటో అన్నట్లు ఉంటాడు. తమ జీవితాలని క్యాజువల్ గా గడిపేస్తున్న టైమ్ లో కోవిడ్ ప్రారంభమై...లాక్ డౌన్ పెడతారు. దాంతో పనులన్నీ నిలిచిపోయి..ఎవరి ఊళ్లకు వాళ్లు వెళ్లాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఈ క్రమంలో తమ సొంతూరు కి ప్రయాణం కట్టిన వీళ్లిద్దరిలో .... నరసింహ రాజు మరణిస్తాడు. అతని మరణం రాజేంద్ర ప్రసాద్ షాక్ కు గురి చేస్తుంది. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన స్నేహితుడి శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అప్పచెప్పాలనే నిర్ణయం తీసుకుంటాడు. ఓ ప్రక్కన కోవిడ్, లాక్ డౌన్... మనుషుల్లో భయం..అయినా కొందరిలో సహాయం చేసే తత్వం...అనేక ఇబ్బందులు దాటి చివరికి స్నేహితుడి శవాన్ని ఎలా సొంతూరుకు చేర్చాడు? బంధాలపై నమ్మకం లేనిరాజేంద్రప్రసాద్ లో మార్పు ఏమి వచ్చింది? చివరకు ఏమైంది వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.2007 లో వచ్చిన అనే చైనా సినిమాకు ఫ్రీమేక్ గా వచ్చిన చిత్రం ఇది. లాక్ డౌన్ అనే ఎలిమెంట్ తప్పిస్తే మిగతాదంతా చాలావరకూ ఎత్తిపోతల పథకం క్రింద చేసిన కథ అని అర్దమవుతుంది. లాక్ డౌన్ సమయంలో ...చాలా మంది రోజూవారీ వలస కూలీలు..తమ ఊళ్లకు బయిలుదేరి చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ విషయాన్ని ఈ చైనా కథకు ముడిపెట్టడంతో ఒరిజనాలిటీ మిస్సైంది. ఐడియాకు ఫుల్ మార్కులు వేస్తారు కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేసరికి తడబడిపోయారు. మనిషి జీవితంలోని ఒడిదుడుకులను పాము, నిచ్చెనల ఆట(వైకుంఠపాళి)తో పోల్చడంతో సినిమాని మొదలెట్టడంతో ఏదో కొత్త సినిమా చూస్తున్నాము అనిపిస్తుంది. కానీ మెల్లిమెల్లిగా విషయం అర్దమవుతుంది. కాకపోతే ఇది వరల్డ్ సినిమా చూసేవారికి మాత్రమే తెలిసిన కామెడీ కావటం కొంతలో కొంత మేలు. ఫస్టాఫ్ ..కోవిడ్, స్నేహం..ఊరికి ప్రయాణం చూపెట్టాడు. అయితే సెకండాఫ్ లో నరసింహరాజు చనిపోవడం.. ఫ్రెండ్ కోల్పోయిన బాధలో రాజేంద్రప్రసాద్.. ఎన్నో మలుపులు, అడ్డంకుల మధ్య క్లైమాక్స్ వరకు తీసుకొచ్చారు. కానీ తెలుగు సినిమాకు తగ్గ కథ లేదనిపిస్తుంది. అలాగే కథకు అక్కర్లేని రాజేంద్రప్రసాద్ ఫైట్ సీక్వెన్స్ ఒకటి. ఇలాంటి కథను ఫ్రీమేక్ చేసినా నేటివిటి పట్టుకుని, కేవలం సోల్ తీసుకుని..ఇక్కడ నేపధ్యానికి తగినట్లు కథ అల్లుకుంటే బాగుండేది.చాలా రోజుల తర్వాత పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. చాలా వరకూ డైలాగులు ఇన్నర్ మీనింగ్ తో సాగాయి. సినిమాలో చర్చించుకోవాల్సిన కంటెంట్ ఉన్నా..హైలెట్ కాలేదు. అలాగే ఎడిటర్ ..సినిమాని ఇంకా ట్రిమ్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. కెమెరా వర్క్ బాగుంది. నాచురల్ లొకేషన్స్ ని అంతే నాచురల్ గా ప్రెజెంట్ చేసాడు. రెండు పాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచిగా ఉన్నాయి. కథ గురించి ఫ్రీమేక్ కాన్సెప్టు కాబట్టి మాట్లాడేందుకు ఏమీ లేదు.
నటీనటుల విషయానికి వస్తే.. రాజేంద్రప్రసాద్ ఇలాంటి బరువైన పాత్రలు చాలా చేసేసాడు. ఆ పాత్రలో మంచి వేరియేషన్స్, ఎమోషన్స్ ఉన్నాయి. ఆయన మాత్రమే చేయగలడు అనిపించింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్దితుల్లో ఓ కమర్షియల్ సినిమాని మాత్రం ఆయన పూర్తిగా మోయలేడు అన్నది నిజం. సీనియర్ నటుడు నరసింహరాజు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. మిగతా నటీనటులు ఓకే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: