అనుకోని ప్రయాణానికి అన్నీ మంచి శకునములే ..!

murali krishna
దీపావళికి విడుదలైన సినిమా టపాసులు ఒక్కొక్కటిగా చల్లారుతున్నాయి. వచ్చిన నాలుగు చిత్రాల్లో దేనికీ యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినప్పటికీ ఉన్నంతలో సర్దార్, ఓరి దేవుడా మెరుగ్గా రాణిస్తుండగా ప్రిన్స్ ఎదురీదుతోంది.జిన్నా రెండో వారానికి ప్యాకప్ చెప్పేందుకు రెడీ అయినట్టే. ఇక ఈ వారం రిలీజయ్యే వాటి విషయానికి వస్తే అనుకోకుండా ఒక్క అనుకోని ప్రయాణం మాత్రమే రేస్ లో నిలబడింది. వెంకటేష్ పెదిరెడ్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, జానపద స్టార్ నరసింహరాజు కాంబినేషన్ లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా చేసిన ఈ ప్రయత్నం 28న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఆడియోకు ఇప్పటికే మంచి పేరు వచ్చింది.
ఈ మధ్య చిరంజీవి నాగార్జున లాంటి పెద్ద హీరోలకే సోలో రిలీజ్ దక్కడం లేదు. అలాంటిది అనుకోని ప్రయాణంకు ఇంతగా కలిసి రావడం విశేషం. ఇటీవలే అనంతపూర్ లో వేసిన స్పెషల్ ప్రీమియర్ నుంచి ప్రేక్షకులు చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికుల స్నేహం ఏ మలుపులు తిరిగింది, వాళ్ళ గమ్యం ఎటు వైపు వెళ్ళింది లాంటి ప్రశ్నలకు ఇందులో ఆసక్తికరమైన రీతిలో సమాధానం చెప్పబోతున్నారు. కామెడీనే కాదు సీరియస్ పాత్రల్లోనూ రాజేంద్ర ప్రసాద్ ఎంత అద్భుతంగా మెప్పిస్తారో ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషిలో చూశాం. వాటిని మించి ఈ అనుకోని ప్రయాణం ఉంటుందని నిర్మాతల నమ్మకం.అలా అని ఆ రోజు అసలు పోటీ లేదని కాదు. వెల్కమ్ టు తీహార్ కాలేజీ, ఫోకస్, ఐడెంటిటి, రుద్రవీణ లాంటి చిన్న సినిమాలున్నాయి కానీ వేటి మీద కనీస స్థాయి బజ్ లేదు. అనుకోని ప్రయాణంలో లీడ్ యాక్టర్స్ తో పాటు తులసి, రవిబాబు, శుభలేఖ సుధాకర్, నారాయణరావు, జోగి బ్రదర్స్, ధన్ రాజ్ లాంటి తారాగణం చాలా ఉంది. ఎన్నో ఏళ్ళ క్రితం దేవి లాంటి విజువల్ వండర్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రేమ మళ్ళీ ఈ అనుకోని ప్రయాణంతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్ని సానుకూలతల మధ్య దీని బాక్సాఫీస్ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి. డాక్టర్ జగన్ మోహన్ నిర్మించిన ఈ ఎమోషనల్ డ్రామాకు సంభాషణలు పరుచూరి బ్రదర్స్ కాగా శివ దినవాహి సంగీతం సమకూర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: