కలర్ స్వాతి- నిఖిల్​ మధ్య ఏమైంది?.

murali krishna
తెలుగు సినిమాతో యువనటుడు నిఖిల్‌ సిద్ధార్థ్ది దాదాపు పదిహేడేళ్ల ప్రయాణం. 2003లో సంబరం సినిమాతో పరిచయమై హ్యాపీడేస్‌ రాజేశ్‌గా, యువతకు చేరువై కార్తికేయతో కంటెంట్‌ ఉన్న హీరోగా నిలదొక్కుకున్నాడు.
కామెడీ, లవ్‌స్టోరీ, క్రైమ్‌, థ్రిల్లర్‌.. ఇలా ఏ అంశంలోనైనా నటించే సత్తా ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కార్తికేయ-2 తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. కార్తికేయతో తొలి సినిమానే సూపర్‌హిట్‌గా మలిచిన దర్శకుడు 'చందూ మొండేటి'. ప్రతిభ ఉన్న డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన దర్శకత్వంలో 'కార్తికేయ-2' విశేషాలను ప్రేక్షకులతో పంచుకోవడానికి వీరిద్దరూ ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేశారు. మరి ఆ యువహీరో, యువదర్శకుడు పంచుకున్న విషయాలేంటో చూద్దామా!
ఇద్దరి కాంబినేషన్లో ఇది రెండో సినిమా. దర్శకుడిగా మీకు ప్రేరణ ఎవరు?
చందూ మొండేటి: ఆర్య (2004) సినిమా విడుదలైనప్పుడు ప్రతీచోట దర్శకుడు సుకుమార్‌ గురించి మాట్లాడుకోవడం వినేవాణ్ని. ఒక సినిమా తీస్తే దర్శకుడికి ఇంత పేరు వస్తుందా అని ఆశ్చర్యపోయిన సందర్భం అది. ఒకవిధంగా ఆయనకు నేను ఏకలవ్య శిష్యుడిని. సినిమాల్లోకి వచ్చాక రాజమౌళికి అభిమానిలా మారిపోయాను. దర్శకుడిగా వీళ్లిద్దరే నాకు రోల్‌మోడల్.
అసలు మీది ఏ ఊరు? మీ కుటుంబ నేపథ్యమేంటి?
చందూ మొండేటి: మాది మీ పక్క ఊరే…పశ్చిమ గోదావరి జిల్లా వేములూరు.
నిఖిల్‌: మాది హైదరాబాద్‌. పుట్టింది.. పెరిగింది.. చదివింది అన్నీ ఇక్కడే.
మీరిద్దరూ ఎలా కలిశారు?మీ ప్రయాణాన్ని ఎలా ప్రారంభించారు?
చందూ మొండేటి: 2005లో ఒక సినిమాకి నేను సుధీర్‌వర్మ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాం. ఆ సినిమాలో శశాంక్‌ హీరో (సై ఫేం). ఆ సినిమాలో హీరో తమ్ముడి రోల్‌కి నిఖిల్‌ని తీసుకున్నారు. నలభై రోజుల షూటింగ్‌ అనంతరం ఆ సినిమా ఆగిపోయింది. కానీ మా ప్రయాణం కొనసాగింది.
నిఖిల్‌: ఫస్ట్‌ టైం ఆ సినిమా ఆఫీసులోనే ఇద్దరం కలిశాం. నేను ఆ రోల్‌ ఆడిషన్‌కి అటెండ్‌ అయ్యి సెలెక్ట్‌ అయ్యాను. కానీ ఆ సినిమా ఆగిపోయింది. అంతకుముందు సంబరం (2003)లో చిన్న పాత్ర చేశా.
మీరు కార్తికేయ సినిమా విడుదల సమయంలో సీక్వెల్‌ ఉంటుందని చెప్పారు.. అంత కచ్చితంగా ఎలా చెప్పారు?
నిఖిల్‌: అవునా సార్‌.. నాకిప్పుడు సరిగా గుర్తు లేదు కానీ సినిమా హిట్టవుద్దనే నమ్మకంతో చెప్పాను. సో అది హిట్టయ్యింది. ఇప్పుడు సీక్వెల్‌ కూడా వచ్చింది. కొవిడ్‌ వల్ల కార్తికేయ-2 కొంచెం ఆలస్యమైంది. సినిమా షూటింగ్‌ 62 రోజుల్లోనే పూర్తయ్యింది. కానీ మధ్యమధ్యలో బ్రేక్‌ వచ్చింది.
పెళ్లికి ముందు వరుసగా సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు తగ్గడానికి కారణం ఏమిటి?
నిఖిల్‌: నిజానికి నేను ఈ లాక్‌డౌన్‌ సమయంలో నాలుగు సినిమాల్లో నటించాను. స్పై, 18పేజెస్‌, సుధీర్‌వర్మతో ఒకటి ఇలా నాలుగు సినిమాలు వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం కార్తికేయ-2 విడుదలపై దృష్టి పెట్టా.
కార్తికేయలో స్వాతి హీరోయిన్‌. కానీ 'కార్తికేయ-2'లో అనుపమా పరమేశ్వరన్‌. మార్పునకు కారణమేంటి?
చందూ మొండేటి: (నవ్వుతూ)హీరో నిర్ణయం ప్రకారమే అలా చేశాం.
నిఖిల్‌: అయ్యయ్యో.. నాకేం తెలీదు. నాపై తోసేస్తున్నారు.
చందూ మొండేటి: కథ మారింది కదండీ. కార్తికేయ మొత్తం సుబ్రహ్మణ్యపురంలో సాగింది. కార్తికేయ-2 ద్వారకాలో జరుగుతుంది. కథలో లొకేషన్‌ మారిందని హీరోయిన్‌ని మార్చాం. కార్తికేయలో లేని కొత్త పాత్రలు ఇందులో ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: