'మగాళ్లు ఇంత అందంగా ఉంటారా' అని ఆయన్ని చూసి అనుకున్నా..!

murali krishna
నటనకు గ్లామరే కాదు... గ్రామర్‌ తెలిసినా సరిపోతుంది. అలా అభినయాన్ని మాత్రమే నమ్ముకొని కూడా అందలాలు ఎక్కొచ్చని నిరూపించింది సాయి పల్లవి. దక్షిణాదిన కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు తను కేరాఫ్‌ అడ్రస్‌.అలాగని కమర్షియల్‌ సినిమాల్ని వదల్లేదు. ఏ సినిమా చేసినా తనకంటూ ఓ గుర్తింపు ఉండేలా కెరీర్‌ని ప్లాన్‌ చేసుకొందామె. తన కెరీర్‌ గురించీ, అభిప్రాయాల గురించీ... సాయిపల్లవి ఏం చెబుతోందంటే...?
అస్సలు బరువు పెరగను..
''నేను పూర్తి శాఖాహారిని. అన్నం, పప్పు.. ఇవి ఉంటే చాలు. సెట్లో కొబ్బరినీళ్లు, మజ్జిగ ఉంటే ఇంకేం అడగను. మేకప్‌ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వర్కవుట్లు పెద్దగా చేయను. అప్పుడప్పుడూ సరదాగా బ్యాడ్మింటన్‌ ఆడతా. నేను త్వరగా బరువు పెరగను. కాబట్టి... నాకు జిమ్‌లో కసరత్తులు చేసే అవసరం రాలేదు. సోషల్‌ మీడియాతో పెద్దగా టచ్‌లో ఉండను. నాకు అదంతా టైమ్‌ వేస్ట్‌ వ్యవహారం అనిపిస్తుంది. అయితే ముఖ్యమైన విషయాలేమైనా ఉంటే చెల్లి చెబుతుంది.''
వంద ప్రశ్నలు వేశా..
''సినిమాల్లోకి అడుగుపెట్టేప్పుడు నాలో లెక్కలేనన్ని భయాలు. నేను అందంగా ఉండను. నా మొహం మీద మొటిమలు ఉంటాయి. అసలు హీరోయిన్‌ మెటీరియలే కాదు. నాక్కూడా ఇండస్ర్టీ చోటు ఇస్తుందా? నన్ను స్ర్కీన్‌పై ప్రేక్షకులు చూడగలరా? ఇలా రకరకాల భయాలు వెంటాడాయి. నేను అప్పటిదాకా చూసిన హీరోయిన్లంతా అందగత్తెలే. వాళ్లతో పోలిస్తే... నేనెంత అనిపించింది. అందుకే 'ప్రేమమ్‌' సెట్‌కి వెళ్లిన తొలిరోజు 'నిజం చెప్పండి... నేను మీ పాత్రకు సరిపోతానా... మధ్యలో తీసేస్తారా?' అంటూ వంద ప్రశ్నలు అడిగా. దర్శకుడు పుత్రేన్‌ నాలో నమ్మకంపెంచడానికి చాలా కష్టపడ్డారు. ఫస్ట్‌ షాట్‌ ఓకే అయిన తరవాత నాలో కాన్ఫిడెన్స్‌ పెరిగింది. 'ప్రేమమ్‌' విడుదలైన రోజు నాకింకా గుర్తు. సినిమా అయిపోగానే అంతా చప్పట్లు కొట్టారు. 'నాకంటూ పరిశ్రమలో చోటు దక్కింది' అని ఆ రోజే అనిపించింది''
'స్టార్‌' ఎవరని అడగను..
ఫలానా హీరోతో కలిసి నటించాలన్న ఆలోచనలు నాకు లేవు. కథ బాగుంటే చేస్తా.. అంతే. 'ఫలానా స్టార్‌ హీరో సినిమాలో మీరు హీరోయిన్‌గా చేస్తారా' అంటే ఆ స్టార్‌ ఎవరు? అని కూడా అడగను. 'ముందు కథ చెప్పండి' అంటాను. కాకపోతే ఇండస్ర్టీలో ఉన్న హీరోలందరిపైనా గౌరవం ఉంది. అల్లు అర్జున్‌తో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఆయన డాన్స్‌ అంటే ఇష్టం. మహేశ్‌బాబు స్ర్కీన్‌ ప్రెజెన్స్‌ అంటే ఇష్టం. 'మగాళ్లు ఇంత అందంగా ఉంటారా' అని ఆశ్చర్యపోతాను. బాలీవుడ్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ ఇష్టం.''
డాన్స్‌ మాస్టర్‌ ఆమెనే..!
నేను నటన నేర్చుకోలేదు. బహుశా.. అదే నా ప్లస్‌ పాయింట్‌. ఇంట్లో ఎలా ఉంటానో, స్ర్కీన్‌పై కూడా అలానే కనిపిస్తా. 'సాయి పల్లవి నటన బాగుంది.. అదిరిపోయింది' అని అంతా అంటుంటే అమ్మకు అర్థం అవ్వదు. 'అదేంటే..? నువ్వెక్కడ నటించావు? ఇంట్లో ఎలా ఉంటావో అలానే కదా స్ర్కీన్‌పై కూడా ఉన్నావు' అంటుంది. డాన్స్‌ కూడా ప్రత్యేకంగా నేర్చుకోలేదు. మాధురీ దీక్షిత్‌ డాన్స్‌ వీడియోలు చూసి ఆ స్టెప్పులు ప్రాక్టీస్‌ చేసేదాన్ని. చిన్నప్పుడు నన్ను భరతనాట్యం క్లాసులకు పంపారు. వారం రోజుల పాటు ఒకే స్టెప్పు నేర్పించారు. 'నాకు ఈ స్టెప్పు వచ్చేసింది.. ఇంకోటి నేర్పండి' అని టీచర్‌ని అడిగా. 'నెల రోజుల పాటు ఇదే స్టెప్పు ప్రాక్టీసు చేయాలి' అన్నారు. అంతే పారిపోయి వచ్చేశా.''అదే రూల్ ఫాలో అవుతున్నా..
''ఫిదా, లవ్‌ స్టోరీ.. ఈ రెండు సినిమాలూ నా కెరీర్‌లో మర్చిపోలేనివే. ఫిదా అయితే నా ప్రయాణం మొత్తాన్ని మార్చేసింది. ఈ విషయంలో శేఖర్‌ కమ్ములగారికి రుణపడి ఉంటాను. ఆయన నా కెరీర్‌నే కాదు, నా ఆలోచనా ధోరణిని కూడా మార్చేశారు. సెట్లో వంద మంది ఉంటే ఆ వంద మందినీ సమానంగా చూసే దర్శకుడు ఆయనేనేమో..? 'మనమంతా ఇక్కడ పని చేయడానికే వచ్చాం.. ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరు తక్కువ కాదు' అంటారు. ఆఖరికి హీరో, హీరోయిన్‌ అనే బేధం లేకుండా ఇద్దరినీ ఒకేలా చూస్తారు. 'నీ హక్కుల గురించి నువ్వు పోరాడు.. సాధించుకో.. అది ఇంట్లో అయినా, సెట్లో అయినా' అని తరచూ చెబుతుంటారు. నా జీవితంలో కూడా ఇదే రూల్ ఫాలో అవుతున్నా.''

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: