పగ పగ పగ సినిమా మాములుగా లేదుగా...!!

murali krishna
బెజవాడలోని బెజ్జోనిపేటలో జగ్గు (కోటి), కృష్ణ (బెనర్జీ) కిరాయి హంతకులు. డబ్బు కోసం ప్రాణాలకు తెగించి హత్యలు చేస్తుంటారు. పోలీస్ హత్య చేసిన కేసులో కృష్ణను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కృష్ణ అరెస్ట్ అయిన సమయంలో కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతానని జగ్గు హామీ ఇస్తాడు. కానీ తన మాటను నిలుపుకోలేకపోతాడు. కృష్ణ జైలుకు వెళ్లిన సమయంలో జగ్గుకు సిరి (దీపిక ఆరాధ్య) అనే కూతురు పుడుతుంది. సిరి పెద్దయ్యాక కృష్ణ కుమారుడు అభి (అభిలాష్)తో ప్రేమలో పడుతుంది. అయితే తన కూతురుతో ప్రేమలో పడిన అభిని చంపేందుకు ప్లాన్ వేస్తాడు జగ్గు.
కృష్ణకు ఇచ్చిన మాటను జగ్గు ఎందుకు నిలుపుకోలేకపోతాడు? జగ్గూ తన పేరును జగదీష్ ప్రసాద్‌గా ఎందుకు మార్చు కుంటాడు ? కన్నకూతురు ప్రేమపై జగ్గు ఎందుకు ద్వేషం పెంచు కుంటాడు ? అభిని హత్య చేయాలనే ప్లాన్ వర్కవుట్ అయిందా? అభిని చంపే డీల్‌ను జగ్గు ఎవరితో చేసుకొన్నాడు? చివరికి అభి, సిరి ఒక్కటయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే పగ పగ పగ సినిమా కథ.
పగ పగ పగ అనే టైటిల్ చూస్తే సినిమా ఏంటో ఈజీగా అర్ధమవుతుంది. అయితే దర్శకుడు రవిశ్రీ దుర్గాప్రసాద్ ఎంచుకొన్న పాయింట్.. ఆ పాయింట్‌ను పిరియాడిక్ నేపథ్యంగా మలచుకొన్న తీరు బాగుంది. అయితే కథను విస్తరించడంలో, కథనాన్ని ఎఫెక్టివ్‌గా కొనసాగించడంలో కాస్త ఇబ్బంది పడ్డారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పాత్రలను డిజైన్ చేసుకొన్న విధానంతో లోపాలను సవరించుకొనే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్ పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడంలోనే సరిపోయింది. ఇక సెకండాఫ్‌లో క్రైమ్ డ్రామా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాకు క్లైమాక్స్ స్పెషల్ ఎట్రాక్షన్. అందరి అంచనాలకు భిన్నంగా క్లైమాక్స్‌ను దర్శకుడు రూపొందించిన విధానం సినిమాకు హైలెట్.
ఇక అభిగా అభిలాష్ కొత్తవాడైనా ఎమోషనల్ సీన్లలో బాగా నటించాడు. యాక్షన్ సీన్లలో ఆకట్టుకొన్నాడు. ఇంకా నటనపరంగా, లుక్ పరంగా సరిద్దిద్దుకోవాల్సిన మైనర్ థింగ్స్ ఉన్నాయి. తొలి చిత్రమైనా అనుభవం ఉన్న నటుడిగా హావభావాలను పలికించాడు. దీపిక ఆరాధ్య తన పాత్రలో ఒదిగిపోయింది. పక్కింటి అమ్మాయిలా కనిపించింది. ఎమోషనల్ సీన్లలో మెప్పించింది. ఇక కోటి సంగీత దర్శకుడిగా, నటుడిగా ఎమోషనల్ పాత్రలో కనిపించాడు. బెనర్జీ కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అందరిని ఆకట్టుకొన్నాడు..
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. కోటి, రోషన్ అందించిన సంగీతం బాగుంది. పాటలు మరియు ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నవీన్ చల్లా సినిమాటోగ్రఫి సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చింది. ఎడిటర్ పాపారావు తన కత్తెరకు మరింత పదును పెట్టాల్సింది. విజయ్ పోలంకి, ఎతిరాజ్, రామ్ సుంకర తదితరులు తమ మార్కును చాటుకొన్నారు. నిర్మాత సత్యనారాయణ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉండే మంచి క్రైమ్ కమ్ లవ్ స్టోరి అయి ఉండేది.
లవ్, క్రైమ్, యాక్షన్, ఎమోషన్స్ కలబోసిన చిత్రం పగ పగ పగ. ఫస్టాఫ్ కాస్త స్లోగా.. సెకండాఫ్ ఆసక్తిగా ప్రేక్షకులను ఉత్సాహానికి గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: