పగ పగ పగ మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

kalpana
కోటి సంగీత దర్శకుడిగా తెలుగు వారికి సుపరిచితుడే. మొదటి సారిగా విలన్‌గా పగ పగ పగ చిత్రంతో మెప్పించేందుకు కోటి వచ్చాడు. ఇక ఈ చిత్రంతో అభిలాష్ సుంకర హీరోగా పరిచయం కాబోతోన్నాడు. సత్యనారాయణ సుంకర నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
కథ...
బెజవాడలో బెజ్జోని పేట చుట్టూ ఈ కథ నడుస్తుంది. 1985 నుంచి 2007 వరకు ఈ కథ సాగుతుంది. బెజ్జోని పేటలో కూని హత్యలు చేసే కాంట్రాక్ట్ కిలర్ల్స్ ఉంటారు. ఒకసారి వాళ్లకు డీల్ ఇస్తే.. చివరి నిమిషంలో ఉన్నా కూడా డీల్ పూర్తి చేసి చస్తారు. అలాంటి హత్యలు చేస్తూ జగ్గూ (కోటి), కృష్ణ (బెనర్జీ) జీవితం సాగిస్తుంటారు. ఓ కేసులో భాగంగా కృష్ణ పోలీసులకు చిక్కుతాడు. కృష్ణ కుటుంబాన్ని చేరదీస్తాను అని జగ్గూ మాటిస్తాడు. కానీ కాలక్రమంలో జగ్గూ జగదీష్ ప్రసాద్‌గా పెద్ద బిజినెస్ మెన్‌గా మారతాడు. తన కూతురి సిరి (దీపిక ఆరాధ్య)యే ప్రపంచంగా బతుకుతుతంటాడు. అలాంటి సిరి కృష్ణ కొడుకు అభి (అభిలాష్)ని ఇష్టపడుతుంది. ఈ విషయం తెలిసిన జగ్గూ.. అభిని చంపేందుకు కాంట్రాక్ట్ మాట్లాడతాడు. కానీ మనసు మార్చుకునే లోపు.. ఆ డీల్ కాస్త బెజ్జోనిపేట వ్యక్తికి చేరుతుంది? ఆ డీల్ తీసుకుంది ఎవరు? తన అల్లుడు అభిని కాపాడుకునేందుకు జగ్గూ చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు అభి మీద అటాక్ చేసింది ఎవరు? అసలు చివరకు ఏం జరుగుతుంది? అనేది కథ.
నటీనటులు...
పగ పగ పగ చిత్రంలో ముందుగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు కోటి గురించే. కోటి తన నటనతో అందరినీ మెప్పిస్తాడు. తన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇక హీరోగా అభిలాష్‌కు ఇది మొదటి చిత్రం. కానీ ఇంతకు ముందే ఎన్నో చిత్రాల్లో యాక్షన్ సీక్వెన్స్, డూప్స్ చేసిన అనుభవం, పీటర్ హెయిన్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ దగ్గర పని చేసిన అనుభవం అభిలాష్‌కు కలిసి వచ్చింది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో అభిలాష్ అదరగొట్టేశాడు. సీరియస్, కామెడీ ఇలా అన్ని ఎమోషన్స్ పండించాడు. హీరోయిన్‌గా సిరి పాత్రలో దీపిక పర్వాలేదనిపిస్తుంది. తెరపై ఉన్నంత సేపు అందంగా కనిపిస్తుంది. బెనర్జీ, కరాటే కళ్యాణి, జీవా ఇలా అందరూ తమ తమ పాత్రల్లో మెప్పించారు.
విశ్లేషణ...
పగ పగ పగ చిత్రంలో దర్శకుడు కొత్త పాయింట్ ఎంచుకున్నా కూడా కథనం మాత్రం పాత దారిలోనే నడిపించేశాడు. పగ, ప్రతీకారాన్ని చూపించడంలో తడబడినట్టు అనిపిస్తుంది. ఇంకా బలమైన సీన్లతో ఎమోషన్లను పండించే అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోనట్టు అనిపించింది. బెనర్జీ, కోటి ద్వితీయార్థంలో కొన్ని సీన్లు పెట్టి ఉండొచ్చు. కానీ దర్శకుడు ఆ ప్రయత్నం చేయలేదు.
ప్రథమార్థంలోని కథ చాలా స్లోగా ముందుకు వెళ్తుంది. కాలేజ్ సీన్లు రొటీన్‌గా అనిపించినా కూడా నవ్వులు పూయిస్తాయి. ద్వితీయార్థంలో ఎమోషన్స్ పండించే స్కోప్ ఉన్నా కూడా.. అనవసరపు సీన్లను ఇరికించినట్టు అనిపిస్తుంది. కిల్లర్‌ను కనిపెట్టడం కోసం చేసే సీన్లను ఇంకాస్త ఇంట్రెస్ట్‌గా మలిచి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
అయితే క్లైమాక్స్ మన ఊహకు భిన్నంగా సాగడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. సినిమా ఎంతో సీరియస్‌గా ముగుస్తుందని ఆశిస్తారు. కానీ కాస్త వినోదాత్మకంగానే క్లైమాక్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. పోకిరి సీన్‌ను ఇందులో వాడుకున్న తీరు బాగుంటుంది.  నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఇక సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మూడ్‌కు తగ్గట్టుగా ఉంటుంది. కెమెరాపనితనం, ఎడిటింగ్ అన్నీ కూడా చక్కగా కుదిరాయి.
రేటింగ్ 2.5/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: