టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో ఒకరు అయిన సత్యదేవ్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశలను దక్కించుకున్నాడు. అందులో భాగంగా సత్యదేవ్ 'బ్లాఫ్ మాస్టర్' మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా, మంచి నటుడుగా మరొకసారి తనను తాను బ్లాఫ్ మాస్టర్ సినిమాతో నిరూపించుకున్నాడు.
ఆ తర్వాత ఉమా పరమేశ్వర సినిమాలో హీరోగా నటించిన సత్యదేవ్ ఈ సినిమాలో కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. కొన్ని రోజుల క్రితం సత్యదేవ్ స్కైలాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సత్యదేవ్ 'గాడ్సే' సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించాడు. సత్యదేవ్ , గోపి గణేష్ పట్టాభి కాంబినేషన్ లో ఇది వరకు బ్లాఫ్ మాస్టర్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో 'గాడ్సే' సినిమాపై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా గాడ్సే మూవీ నుండి చిత్ర బృందం ఒక అప్డేట్ ను విడుదల చేసింది. గాడ్సే సినిమాను జూన్ 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా ప్రకటించింది. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లో సత్యదేవ్ బ్లాక్ కలర్ లో ఉన్న సూట్ ను వేసుకొని, రెండు చేతుల్లో రెండు తుపాకులు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ పోస్టర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంది. మరి గాడ్సే సినిమాతో సత్యదేవ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.