‘డీజే టిల్లు’ రాధికతో కార్తికేయ కొత్త సినిమా.. ఎట్లుంటదో..!?

N.ANJI

ఇటీవల విడుదలైన ‘డీజే టిల్లు’ సినిమా మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహా శెట్టికి మంచి పేరు.. విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్ వచ్చింది. ఈ సినిమాలో డీజే టిల్లు రాధిక పేరుతో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. చాలా మంది ఈ సినిమాలోని డైలాగ్స్ తో రీల్స్ కూడా చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నేహాశెట్టి ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది. సినిమా మంచి హిట్ అందుకోవడంతో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. తాజాగా యువ కథానాయకుడు కార్తీకేయతో జతకట్టనుంది.


లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కార్తీకేయ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా ఒక సినిమా ప్రారంభం అయింది. ఈ సినిమాకు డైరెక్టర్‌గా క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నిర్మాతగా రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ‘కలర్ ఫోటో, తెల్లవారితే గురువారం’ వంటి సినిమాలకు రవీంద్ర బెనర్జీ నిర్మాతగా వ్యవహరించారు. సి.యువరాజ్ సమర్పణలో ఈ సినిమా ప్రారంభమైంది. శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముహూర్తం సన్నివేశానికి నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లాప్ కొట్టారు. అలాగే హీరో కార్తికేయ సతీమణి లోహిత కెమెరా స్వచ్ఛాన్ చేయగా.. దర్శకుడు బుచ్చిబాబు సానా చిత్ర బృందానికి స్క్రిప్ట్ ‌ను అందజేశారు.


ఈ సందర్భంగా దర్శకుడు సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. దర్శకుడు మాట్లాడుతూ.. సినిమాలో హీరో క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని, ఎవరేమనుకున్నా.. తనకు నచ్చినట్లు జీవిస్తూ.. తనదైన దారిలో వెళ్లే ఒక యువకుడి కథ అని ఆయన పేర్కొన్నారు. అలాగే నిర్మాత మాట్లాడుతూ.. గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా ఉంటుందన్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైందని, త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. ఈ సినిమాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాట రాశారన్నారు. రాజ్ కుమార్ కసిరెడ్డి, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఆటో రామ్‌ప్రసాద్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: