ఆర్ఆర్ఆర్ పై విషం చిమ్ముతోంది ఎవరు..?

Deekshitha Reddy
ఆర్ఆర్ఆర్ సినిమాపై సోషల్ మీడియాలో కొంతమంది నెగెటివ్ ప్రచారం చేస్తున్నారనే విషయం తెలిసిందే. సినిమా విడుదల రోజే నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. రామ్ చరణ్ కి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టారని, ఎన్టీఆర్ క్యారెక్టర్ నిడివి కాస్త తక్కువగా ఉందని రెచ్చ చేశారు. కానీ ఫ్యాన్స్ అలాంటి ప్రచారానికి ఆవేశపడిపోలేదు. సంయమనంతోనే ఉన్నారు. మరోవైపు హీరోలు కూడా హ్యాపీగానే ఉన్నారు. మధ్యలో ఈ బ్యాచ్ కి ఏం కష్టమొచ్చింది. అసలు ఎందుకీ ప్రచారమంతా..?
అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ విషయంలో కూడా రాజమౌళిని ఓ వర్గం సీరియస్ గా టార్గెట్ చేసింది. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ని తప్పుగా చూపించారని, ఆయన బ్రిటిష్ వారి మాట వినే వ్యక్తిగా, వారి కింద పనిచేసే వ్యక్తిగా ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తూ చూపించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అల్లూరి ఎప్పుడూ బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేయలేదనేది వాస్తవం, అయితే రాజమౌళి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. కానీ దాన్ని ఆ రేంజ్ తో తప్పుబడతారని ఎవరూ అనుకోలేదు. మరి బయటనుంచి ఎక్కడా విమర్శలు రానిచోట.. వెబ్ సైట్స్ లో ఎందుకు విమర్శల జడివాన మొదలైంది.
ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్ష్లపై కూడా ఓ పథకం ప్రకారం వ్యతిరేక వార్తలొస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా పనైపోయిందని, ఫస్ట్ త్రీడేస్ మాత్రమే కలెక్షన్లు బాగా వచ్చాయని, సోమవారం నుంచి పూర్తిగా వీక్ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఏపీలో టికెట్ రేట్ల పెంపు వల్ల ఆర్ఆర్ఆర్ కి నష్టం జరుగుతోందని కూడా ప్రచారం చేస్తున్నారు. పదిరోజులపాటు సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచుకునే అవకాశం వచ్చిందని, అందుకే జనాలు థియేటర్లకి రావడంలేదని అంటున్నారు. మరోవైపు క్షేత్ర స్థాయిలో మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్స్ అన్నీ హౌస్ ఫుల్ గా మారుతున్నాయి. ఎక్కడ తేడా వచ్చింది. అసలు ఆర్ఆర్ఆర్ పై ఈ నెగెటివ్ ప్రచారం ఎందుకు.
అయితే దీనిపై రాజమౌళి కానీ, మిగతా టీమ్ ఎవరూ స్పందించడంలేదు. ఓ వర్గం మీడియా మాత్రం ఆర్ఆర్ఆర్ ని నెత్తిన పెట్టుకుంది. మొత్తమ్మీద రాజమౌళి తీసిన గత సినిమాల విషయంలో అందరూ ఒకే అభిప్రాయంతో ఉండేవారు. సినిమా బాగుంటే బాగుందని, లేకపోతే లేదని నిర్మొహమాటంగా చెప్పేవారు. కానీ ఆర్ఆర్ఆర్ విషయంలో మాత్రమే ఈ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథపై కసరత్తులు చేయలేదని కొందరు, విజువల్ గ్రాండియర్ అని ఇంకొందరు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: