శ్రీ‌హ‌రి సినిమాల్లోకి రాక‌ముందు అలాంటి ప‌ని చేసేవాడ‌ట‌..తెలుసా?

VUYYURU SUBHASH
దివంగ‌త న‌టుడు శ్రీ‌హ‌రి అంటే తెలియ‌ని వారుండ‌రు. 1986లో సినిమాల‌కు స్టంట్ మాస్టర్‌గా కెరీర్ స్టార్ చేసిన‌ శ్రీహరి.. ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయ‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత చిన్న చిన్న పాత్ర‌లు చేస్తూ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకునేందుకు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డిన ఈయ‌న‌.. `పోలీస్` సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా శ్రీ‌హ‌రికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ త‌ర్వాత అయోధ్య రామయ్య, హనుమంతు, విజయరామరాజు, శ్రీశైలం, భద్రాచలం ఇలా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
అలాగే మ‌రోవైపు ఢీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మగధీర వంటి చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ న‌టించి సూప‌ర్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న శ్రీ‌హ‌రి.. డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా.. కూతురు అక్ష‌ర‌ పుట్టిన నాలుగు నెలలకే అకాల మరణం చెందింది. దాంతో శ్రీ‌హ‌రి ఆక్ష‌ర పేరుతో  ఫౌండేషన్ నెలకొల్పి ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.
అలాగే సాయం కోసం ఎవ‌రు వెళ్లినా వారికి లేదు, కాదు అనకుండా త‌న వంతు స‌హాయ‌ప‌డి.. రియ‌ల్ హీరో అనిపించుకున్నారు. అటువంటి వ్య‌క్తి సినిమాల్లోకి రాక‌ముందు ఏం ప‌ని చేసేవాడో తెలుసా..? సైకిల్ మెకానిక్. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. శ్రీహరి సినిమాల్లోకి రాక ముందు ఎలమర్రులో  శోభన థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు సైకిల్ షెడ్డులో మెకానిక్ గా పని చేసేవాడ‌ట‌.
ఇక‌ ఖాళీ దొరికిన సమయంలో శోభన థియేటర్ లో సినిమాలు చూస్తూ న‌ట‌న‌పై మ‌క్కువ‌ పెంచుకున్నారు. ఆ మ‌క్కువ‌తోనే సినిమాల్లోకి వ‌చ్చిన ఆయ‌న.. కమెడియన్‌గా, విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అసమాన నటనా చాతుర్యంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. కాగా, శ్రీ‌హ‌రి లివ‌ర్ స‌మ‌స్య‌ కారణంగా 2013 అక్టోబర్ లో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: