బాలీవుడ్ ఒకనాటి స్టార్ హీరో సంజయ్‌దత్, ఖాన్‌త్రయంలో ఒకరైన సల్మాన్‌ఖాన్, మరో హీరో సైఫ్ ఆలీఖాన్‌లకు సంబంధించిన ఓ కామన్ పాయింట్ తెలుసుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది. ఈ హీరోల తల్లిదండ్రులందరూ ప్రేమ వివాహం చేసుకుని జంటలుగా మారినవారే. అంతేకాదు.. వారివి మతాంతర వివాహాలు కూడా. సంజయ్‌దత్ గత తరం ప్రముఖ నటులు సునీల్‌దత్, నర్గీస్‌ల తనయుడు. సునీల్‌దత్ అసలుపేరు బలరాజ్దత్. వీరిది పంజాబ్‌కు చెందిన హిందూ కుటుంబం. ఇక ఆయన ప్రేమించి మనువాడిన నాటి బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నర్గీస్ అసలు పేరు ఫాతిమా రషీద్. ఆమె ముస్లిం కుటుంబానికి చెందినవారు. 1959 జూలై, 29న ఈ దంపతులకు సంజయ్‌దత్ జన్మించాడు. తన తల్లినర్గీస్ 1981లో చనిపోవడం సంజయ్‌దత్ జీవితంలో కోలుకోలేని షాక్ లా మారింది. అతడి జీవితంలో తల్లిలేని లోటు కారణంగానే పలు ఒడిదుడుకులు ఎదురయ్యాయి. వాటినుంచి బయటపడి మళ్లీ నిలదొక్కుకోవడానికి సంజూభాయ్కి చాలా కాలమే పట్టింది. ఆ తరువాత పలు హిట్ సినిమాల్లో హీరోగా నటించి రాణించాడు. ఇక సల్మాన్‌ఖాన్ తండ్రి ప్రముఖ సినీ రచయిత సలీంఖాన్. ఆయన మొదటి భార్య సుశీలాచరక్ సల్మాన్ తల్లి. అయితే ఆవిడ ఇస్లాం స్వీకరించి సల్మాగా పేరు మార్చుకుంది. వీరిద్దరికీ 1965 డిసెంబర్ 27న సల్మాన్ జన్మించాడు. మైనే ప్యార్‌కియా మూవీతో కెరీర్ ప్రారంభంలోనే సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సల్మాన్ ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడు. అంతేకాదు పలువురితో ప్రేమాయణాలు నడిపినా ఇప్పటికీ పెళ్లికాని ప్రసాద్‌లా ఉండిపోవడం కాస్త విచిత్రమే.
ఇక సైఫ్ ఆలీ ఖాన్ ఒకనాటి భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ- బాలీవుడ్ ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ల తనయుడు. టైగర్ పేరుతో అందరూ గౌరవించే పటౌడీ ముస్లిం రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కాగా, షర్మిలా ఠాగూర్ హిందూ కుటుంబానికి చెందిన మహిళ. వీరి కలల పంటగా 1974, ఆగస్టు 16న సైఫ్ ఆలీఖాన్ జన్మించాడు. పలు బాలీవుడ్ సినిమాల్లో హీరోగా నటించినా పై ఇద్దరి స్థాయి స్టార్డమ్ సైఫ్ సొంతం చేసుకోలేకపోయాడనే చెప్పాలి. బాలీవుడ్ నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు.