ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆగష్టు గందరగోళం !

Seetha Sailaja
లేటెస్ట్ గా విడుదలైన ‘తిమ్మరుసు’ ‘ఇష్కు’ సినిమాలకు యావరేజ్ రేటింగ్స్ రావడంతోపాటు ప్రేక్షకుల నుండి స్పందన కూడ అంతంతమాత్రంగానే ఉంది. దీనితో చిన్న సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఇక ధియేటర్లకు రారా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో కలుగుతున్నాయి. పెద్ద సినిమాలు వస్తాయి అనుకుంటే అవి ఎప్పుడు వస్తాయో ఆమూవీ నిర్మాతలకే తెలియని పరిస్థితి.

ప్రభాస్ ‘రాథే శ్యామ్’ సంక్రాంతికి వాయిదా పడటంతో కనీసం అనుకున్న విధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ దసరా కు వస్తుందా రాదా అన్న దిశలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణాలో అన్ని షోలకు అనుమతులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ షోలకు అనుమతిలేదు. ఆగష్టు 15వరకు ఆంధ్రప్రదేశ్ లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది అంటున్నారు. దీనికితోడు టిక్కెట్ల పెంపు విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.

దీనితో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు అయిన గీతా యువీ ఆసియన్ సురేష్ మూవీలు లాంటి సంస్థలు ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా ధియేటర్లు తెరవడం దండగ అనుకుంటున్నట్లు టాక్. ఆంధ్రాలో 100శాతం ఆక్యుపెన్సీ విషయమై అక్కడి ప్రభుత్వం నుండి స్పందన రావడం లేదు.

100 శాతం ఆక్యుపెన్సీ వచ్చిన తరువాత మాత్రమే ‘లవ్ స్టోరీ’ ‘టక్ జగదీష్’ ల విడుదల అంటున్నారు. ఈలోపున ఆగష్టు 3వ వారం వచ్చేస్తే అప్పటికి ఇప్పుడు వస్తున్న సంకేతాల ప్రకారం కరోనా థర్డ్ వేవ్ మళ్ళీ తీవ్ర స్థాయి వైపు అడుగులు వేసే పరిస్థితులు ఏర్పడతాయి.  దీనితో ఆగష్టు నెలలో కూడ కేవలం చిన్న సినిమాలు మాత్రమే విడుదల అవుతాయని మీడియం రేంజ్ సినిమాలు కూడ విడుదల అవ్వకపోవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తున్న బయ్యర్లు మాత్రం నిర్మాతలతో తమ సినిమాల కొనుగోలు రేట్ల పై చాల బేరాలు ఆడుతున్నారని ఇలాంటి పరిస్థితులలో చాలామంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ లకు అమ్మలేక ధియేటర్లలో విడుదల చేసే పరిస్థితులు లేక వడ్డీల సమస్య మధ్య కూరుకు పోతున్నారు అంటూ ఇండస్ట్రీలో రకరాకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: