ఓటీటీ పై కోలీవుడ్ నిర్ణయంతో ఆలోచనలలో పడ్డ టాలీవుడ్ !

Seetha Sailaja

జూలై లో ధియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నా అలా తెరుచుకున్న ధియేటర్లు ఎంతకాలం మళ్ళీ కొనసాగుతాయో క్లారిటీ లేదు. దీనికి కారణం థర్డ్ వేవ్ భయాలు. ఇలాంటి పరిస్థితులలో ధైర్యం చేసి ధియేటర్ల వైపు చూడటంకన్నా పెట్టిన పెట్టుబడి వస్తే ఓటీటీ వైపు వెళ్ళిపోవాలని అనేక సినిమా నిర్మాణ సంస్థలు ఆలోచిస్తున్నాయి.

సురేష్ మూవీస్ లాంటి భారీ నిర్మాణ సంస్థ కూడ నడుస్తున్న పరిస్థితుల పై నమ్మకాలు కుదరక ‘నారప్ప’ ‘దృశ్యం 2’ సినిమాలను ఓటీటీ సంస్థలకు ఇచ్చేసింది అంటే నిర్మాతలు ఎలాంటి భయాలలో ఉన్నారో అర్థం అవుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ట్రెండ్ ను తమకు అనుకూలంగా మార్చుకుని క్యాష్ చేసుకోవాలని అనేక ప్రముఖ ఓటీటీ సంస్థలు నిర్మాతలతో సినిమాల కొనుగోలుకు సంబంధించి గీసిగీసి బేరాలు ఆడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ పరిస్థితులలో వందల కోట్లల్లో వడ్డీలు కట్టలేక నిర్మాతలు నలిగి పోతున్నారు. ఇలాంటి పరిస్థితులకు పరిష్కారంగా కోలీవుడ్ పరిశ్రమ ఒక కొత్త ఆలోచనను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ పరిశ్రమ తరఫున ఒక ఓటీటీ ఛానల్ ను తామే స్థాపించి మధ్యతరహా చిన్నతరహా నిర్మాతల కష్టాలను తీర్చడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ ఇండస్ట్రీ చేపడుతున్న ఈ వినూత్న ప్రక్రియకు కోలీవుడ్ హీరోలు దర్శకులు నిర్మాణ సంస్థలు అందరు సహకరిస్తున్నట్లు టాక్. ఇలాంటి ప్రయత్నం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడ ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న ‘మా’ సంస్థ ఎన్నికల రగడ చూస్తుంటే భవిష్యత్ లో మా సంస్థ తెలంగాణ ‘మా’ ఆంధ్రప్రదేశ్ ‘మా’ అనే రెండు విభాగాలుగా విడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కోలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న మంచిపనిని పట్టించుకునే వారు ఎవరు అన్నది సమాధానం దొరకని ప్రశ్న. ప్రాంతాలుగా సామాజిక వర్గాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీ విడిపోతున్న పరిస్థితులను చూసి చాలామంది కలవర పడుతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: