ఆయన్ని తెలుగు కమల్ అనేవారు.. కెరీర్ మాత్రం... ?

Satya

కమల్ హాసన్ డెబ్బై దశకం మధ్యలో సినీ పరిశ్రమలో ఎంటరై అప్పటిదాక ఉన్న ట్రెండ్ ని మార్చేశారు. అప్పట్లో కోలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లోనూ కమల్ ప్రభావం చాలా ఉండేది. అదే టైమ్ లో తెలుగులో ఎంతో మంది యువ హీరోలు ప్రవేశించి నిలదొక్కుకుంటున్నారు.


వారిలో నరసింహరాజు ఒకరు. ఆయన నీడలేని ఆడది సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ సూపర్ హిట్. ఆ తరువాత వెల్లువలా సినిమాలు వస్తాయి అనుకుంటే రాలేదు. ఆయన అవకాశాల కోసం దాసరి నారాయణరావు లాంటి వారిని కలిసేవారు. ఇదిలా ఉంటే దాసరి నరసింహరాజులో కమల్ ని చూశారు. ఆయన తూర్పు పడమర మూవీని తెలుగులో తీస్తే దానికి హీరోగా నరసింహరాజుని ఎంపిక చేశారు. ఇదే పాత్ర తమిళ్ లో కమల్ వేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.


ఆ తరువాత దాసరి కన్యాకుమారి మూవీ తీస్తే అందుకో నరసింహరాజు హీరో. ఇది కూడా బాగా ఆడింది. ఈలోగా  విజయబాపినీడు రంభ ఊర్వశి మేనక పేరుతో నరసింహరాజుతో ఆ రోజుల్లోనే పెద్దలకు మాత్రమే లాంటి మూవీ తీస్తే సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో ప్లే బాయ్ పాత్రలో నరసింహరాజు అదరగొట్టారు. మరో వైపు ఆయనకు ఇలాంటి పాత్రలతో పాటు విఠలాచార్య వంటి టాప్ డైరెక్టర్ తో జానపద హీరోగా వెలిగిపోయే చాన్స్ కూడా వచ్చింది.


ఒక దశలో నరసింహరాజు బిజీ హీరోగా రాణించారు. ఆయన పునాది రాళ్ళు సినిమాలో హీరో అయితే చిరంజీవి ఎంట్రీ మూవీ అది. ఇక ఆయన పున్నమినాగులో కూడా చిరంజీవితో కలసి నటించారు. సింహ స్వప్నం అన్న మూవీని నరసింహరాజు ఆ రోజుల్లో పక్కా  మాస్ యాక్షన్ ఓరియెంటెడ్ గా తీస్తే జనాలు ఊగారు. నరసింహరాజు కటౌట్లు ఆయన ఫ్యాన్స్ నాటి అగ్ర హీరోల కంటే ఎత్తున పెట్టి పూజించారు. అలాంటి నరసింహరాజు టాలీవుడ్ లో ఆనాటి రాజకీయాల మూలంగా దెబ్బ తిన్నారు. ఆయన కెరీర్ కూడా ఒక్కసారిగా డల్ అయిపోయింది.


ఆయన మంచి ఉద్దేశ్యంతో చేసిన కొన్ని వ్యాఖ్యలను నాడు టాలీవుడ్ ని శాసిస్తున్న కొందరు హీరోలు వేరుగా అర్ధం చేసుకోవడంతో కష్టాలు మొదలయ్యాయని అంటారు. మొత్తానికి ఎనభై దశకం వచ్చేసరికి ఆయన కెరీర్ పూర్తిగా తల్లకిందులు అయింది. జమీందారీ వంశానికి చెందిన ఈ హీరో సినిమాల మీద పాషన్ తో ఆస్తులను కూడా పోగొట్టుకుని టాలీవుడ్ లో రాణించాలని చూశారు. కానీ విధి ఆయన్ని అలా పక్కకు నెట్టేసింది అని చెప్పుకోవాలి. ఏది ఏమైనా నరసింహరాజు తెలుగు కమల్ హాసన్. నాటి హీరోలకు భిన్నమైన స్టైల్ తో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: