త్రివిక్రమ్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో.. ఏమని చెప్పాడంటే

P.Phanindra
రెడీ, కందిరీగ వంటి సినిమాలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన ఎనర్జిటిక్ హీరో రామ్.. ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్‌’ సినిమాతో మాస్ ఆడియెన్స్ ను కూడా ఓ ఊపు ఊపాడు. చాలా కాలం తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు వచ్చిన భారీ హిట్ ఈ సినిమానే. ఈ ఊపులోనే మరో మంచి సబ్జెక్ట్ ఎంచుకున్న రామ్ పోతినేని.. తమిళ్ లో హిట్ కొట్టిన తాండమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ‘రెడ్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న విడుదలకు సిద్ధం అయింది. కిషోర్ తిరుమ‌ల దర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే మంచి హైప్ సంపాదించుకుంది.
ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని రామ్ కూడా గట్టి నమ్మకం మీద ఉన్నాడు. అనుకున్నట్లే ఈ సినిమా గనుక హిట్ కొడితే.. వరుస విజయాలతో రామ్ మంచి జోరు మీద ఉన్నట్లే. ఇలాంటి సమయంలో రామ్ తర్వాతి సినిమా ఎవరితో అనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో రామ్ సినిమా చేస్తున్నాడనే పుకార్లు ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిలో నిజమెంత? అనే విషయం తెలియడం లేదు. ఇప్పటికే త్రివిక్రమ్ తన తర్వాతి మూవీ ఎన్టీఆర్ తో అని ప్రకటించాడు. మరి రామ్ తో సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? అనే అనుమానాలు ఉన్నాయి. వీటిపై క్లారిటీ ఇచ్చేందుకు రామ్ ప్రయత్నించాడు. తనకు త్రివిక్రమ్‌తో సినిమా చేయాలనే కోరిక చాలా బలంగా ఉందని, ఛాన్స్ దొరికితే కచ్చితంగా ఆయనతో సినిమా చేస్తానని చెప్పాడు. అయితే ప్రస్తుతం ఇంకా అటువంటి ప్లాన్ ఏదీ లేదని స్పష్టం చేశాడు.
`త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఈ మధ్యే ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. మా కలయికలో కచ్చితంగా ఓ సినిమా వస్తుంది. అయితే అది ఎప్పుడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేను` అని రామ్ చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోయేది ఈ ఎనర్జిటిక్ హీరోనే అంటూ వార్తలు గుప్పుమన్నాయి. చూద్దాం మరి ఏమవుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: