ఒకే బాటలో నడుస్తోన్న మెగా హీరోలు !

Chaganti
తెలిసి ప్లాన్ చేశారో ? లేక అనుకోకుండా కుదిరాయో కానీ మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే రూట్ లో నడుస్తోంది. ఇప్పటిదాకా లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాలు తీసి అలసి పోయారో ? లేక ప్రేక్షకులకి కొత్తదనం ఇద్దామనుకున్నారో కానీ మెగా హీరోలు అంతా రాజుల కాలంలోకి వెళ్తున్నారు. భారీ ఖర్చు అయినా పర్లేదని భావించి పీరియాడికల్ జానర్ లో సినిమాలు తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటి దాకా మాస్, యాక్షన్ కధకి కేరాఫ్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్‌ తన కెరీర్ లోనే మొదటి సారిగా పీరియాడికల్‌ మూవీ చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో బ్రిటీష్ కాలంనాటి కథలో గజదొంగ పాత్రలో నటిస్తున్నాడు పవన్.
ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ అనుకున్నా వీర అనే మరో టైటిల్ కూడా రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు మేకర్స్. ఈ సినిమాలో తెలంగాణా రాబిన్ హుడ్ గా పేరున్న పండుగ సాయన్న పాత్రను పవన్ పోషించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా కాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రాజమౌళి దర్శకత్వంలో రౌద్రం రణం రుధిరం అనే సినిమా అదే ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పీరియాడిక్ డ్రామానే. ఇందులో రామ్ చరణ్ స్వాతంత్ర సమార యోధుడైన అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
ఇక చిరంజీవి చివరి సినిమా సైరా కూడా పీరియాడిక్ డ్రామానే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో స్వాతంత్ర సమారయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించాడు చిరు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కూడా ‘రుద్రమదేవి’ సినిమాలో గోనా గన్నారెడ్డి పాత్రలో నటించి మెప్పించాడు. వరుణ్ తేజ్ కూడా ఇప్పటికే కంచే అనే సినిమాలో నటించారు. అది కూడా పీరియాడిక్ సినిమానే. అలా ఫ్యామిలీ హీరోలందరు ఒక్కొక్కరుగా పీరియాడిక్ పాత్రలు చేసి అలరిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: