స్టార్ డైరక్టర్ ను విచారించనున్న పోలీసులు.. ఎందుకంటే

Murali

దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్న సమయంలో కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అంశం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య. వృత్తిపరమైన ఒడిదుడుకులతో ఆత్మహత్య చేసుకున్న ఈ యువ బాలీవుడ్ నటుడి ఆత్మహత్మ ఇంకా ప్రకంపనలు రేపుతూనే ఉంది. బాలీవుడ్ లో అంతర్లీనంగా పాతుకుపోయిన నెపోటిజం సుశాంత్ ఆత్మహత్యతో బయటకు వచ్చింది. కేసును సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ వేగవంతం చేస్తోంది. ఎందరో బాలీవుడ్ ప్రముఖులను ఈ కేసులో పోలీసులు విచారించడం ఇందుకు నిదర్శనం. ఇప్పుడు సీనియర్ దర్శక నిర్మాత మహేశ్ భట్ ను ఈ కేసులో విచారించనున్నారు.

 

ఇప్పటికే సంజయ్ లీలీ భన్సాలీ, ఆదిత్య చోప్రా, రుమీ జాఫ్రీ వంటి బాలీవుడ్ ప్రముఖుల్ని విచారించి స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ భట్ ను విచారణకు హాజరుకావాలని ఆదేశించడం సంచలనం రేపుతోంది. మరో రెండు రోజుల్లో బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ను కూడా విచారించబోతున్నట్టు తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి అతను వృత్తిపరంగా ఎదుర్కొన్న సవాళ్ల ఆధారంగా ఈ దర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్ నెపోటిజంపై ఇప్పటికీ తన వాదన వినిపిస్తోంది ఫైర్ బ్రాండ్ కంగనా. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కూడా అంటున్నారు.

 

ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు 37 మందిని విచారించారు. ఇంకా మరికొంతమంది ప్రముఖులను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఎంతమందిని విచారిస్తున్నా ఇంకా విచారించేందుకు మరికొందరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. మరి ఈ కేసు మరెన్ని మలుపులు తీసుకుంటుందో ఇంకెంత మందిని విచారిస్తారో.. ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. దీంతో ఈ అంశం బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: