హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సత్తుపల్లిలో సండ్రకు తిరుగులేదా?

ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం...తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983 నుంచి చూసుకుంటే...2018 వరకు ఇక్కడ టీడీపీ హవా నడిచింది. 1985, 1994, 1999 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ నుంచి గెలవగా, 2009, 2014, 2018 ఎన్నికల్లో సండ్ర వెంకట వీరయ్య వరుసగా టీడీపీ నుంచి గెలిచారు. అంటే సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్యకు ఎంత అండగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సత్తుపల్లి టీఆర్ఎస్ అడ్డాగా మారిపోయింది.
ఎందుకంటే అటు తుమ్మల ఎలాగో టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. ఇక 2018లో గెలిచాక సండ్ర వెంకట వీరయ్య కూడా తప్పనిసరి పరిస్తితుల్లో టీఆర్ఎస్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. అప్పటివరకు చంద్రబాబుకు అండగానే ఉంటూ వచ్చారు. కానీ రోజురోజుకూ టీడీపీ దిగజారిపోతూ వచ్చింది. దీంతో సండ్ర వెంకట వీరయ్య తప్పక టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు.
టీఆర్ఎస్‌లోకి వెళ్ళడంతో నియోజకవర్గానికి కావాల్సిన పనులు చేసుకుంటున్నారు. ఇంతవరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటంతో సత్తుపల్లిలో సరిగ్గా పనులు చేయడం కుదరలేదు. కానీ ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్ళడంతో..కాస్త పనులు చేయించుకుంటున్నారు. సత్తుపల్లి పట్టణం అభివృద్ధికి నిధులు తెచ్చుకుని పనులు చేస్తున్నారు. నియోజకవర్గంలో సి‌సి రోడ్లు, వాటర్ ట్యాంక్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే సత్తుపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది.. పట్టణంలో జాతీయ రహదారి ఇరువైపులా పలు వ్యాపార దుకాణాలు, బ్యాంకులు, ఇతర సంస్థలు ఉన్నాయి...కానీ వాటికి సరైన పార్కింగ్ సౌకర్యం లేదు...పైగా వాటి ముందు చిన్నాచితక వ్యాపారాలు చేసుకునేవారు ఉన్నారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు బాగా ఎక్కువ అయ్యాయి. అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది. నియోజకవర్గంలో తాగునీటి ఇక్కట్లు ఉన్నాయి.
రాజకీయంగా చూస్తే సత్తుపల్లిలో వీరయ్య స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉండటంతో ఈయనకు త్వరలో మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇక సత్తుపల్లిలో ప్రత్యర్ధి పార్టీల ఉనికి సరిగ్గా లేదు. మొత్తానికైతే సత్తుపల్లిలో వీరయ్యకు తిరుగులేదనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: