హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కూల్‌ అయిన ఫైర్‌బ్రాండ్...బలం పెంచుకున్నారా?

నెల్లూరు రూరల్ నియోజకవర్గం...అధికార వైసీపీకి కంచుకోట. గత రెండు పర్యాయాలు ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతూ వస్తుంది. వైసీపీ తరుపున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. 2014 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన కోటంరెడ్డికి నెల్లూరు రూరల్‌లో తిరుగులేదనే చెప్పొచ్చు. ఈయనకు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా అధికారంలో ఉండటంతో కోటంరెడ్డి... సాధ్యమైన మేర పనులు చేసుకుంటూ వెళుతున్నారు.
నియోజకవర్గంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు, సి‌సి రోడ్ల నిర్మాణాలు జరిగాయి. అటు జగనన్న కాలనీల ద్వారా పేదలకు ఉచితంగా ఇళ్ళు నిర్మించే కార్యక్రమం జరుగుతుంది. నాడు-నేడు ద్వారా రూరల్‌లో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి. అయితే మొన్నటివరకు దూకుడుగా ఉన్న కోటంరెడ్డి...ఈ మధ్య పూర్తిగా దూకుడు తగ్గించేశారు. అసలు వైసీపీలో కోటంరెడ్డి అంటే ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు. అలాంటి నాయకుడు సడన్‌గా శాంతి మంత్రం జపిస్తున్నారు.
అనవసరంగా ఫైర్ అయ్యి..వివాదాలు కొనితెచ్చుకోకుండా కూల్‌గా పనిచేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ప్రత్యర్ధులు విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా ప్రత్యర్ధులు సద్విమర్శలు చేస్తే, వాటిని స్వీకరించి, నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలాగే రూరల్‌లో వైసీపీ నేతలు కూడా ఎవరి మీద విమర్శలు చేయొద్దని కోటంరెడ్డి ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. ఇలా కూల్‌గా ముందుకెళుతున్న కోటంరెడ్డికి నియోజకవర్గంలో ప్రజల మద్ధతు పెరుగుతుందని తెలుస్తోంది.
టీడీపీ ఓటర్లు సైతం కోటంరెడ్డి పనితీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. పైగా సొంత నాయకులతో ఉన్న ఆధిపత్య పోరుకు కూడా కోటంరెడ్డి చెక్ పెట్టేసి, తన దారిలో తాను వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇక కోటంరెడ్డికి అపోజిట్‌గా టీడీపీ తరుపున అబ్దుల్ అజీజ్ పని చేస్తున్నారు. ఈయన కూడా ప్రజా సమస్యలపై బాగానే పోరాటం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయాలని బాగానే కష్టపడుతున్నారు. కానీ ప్రజల మద్ధతు ఎక్కువగా ఉన్న కోటంరెడ్డికి చెక్ పెట్టడం అజీజ్‌కు కాస్త కష్టమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: