హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: నాగార్జునకు ఫ్యామిలీనే దిక్కు..!

గత ఎన్నికల్లో చాలామంది రాజకీయ నేతల వారసులు ఏపీ రాజకీయాల్లో అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. అలాగే పలువురు నాయకులు టికెట్ దక్కించుకుని, తొలిసారి ఎమ్మెల్యేలుగా సత్తా చాటారు. అలా తొలిసారి ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో కె. నాగార్జున రెడ్డి ఒకరు. అమెరికాలో చదివి సొంత రాష్ట్రానికి వచ్చిన నాగార్జున, తన తండ్రి కే‌పి కొండారెడ్డి అండతో గత ఎన్నికల్లో మార్కాపురం వైసీపీ టికెట్ దక్కించుకున్నారు. అయితే కొండారెడ్డి గతంలో కాంగ్రెస్ తరుపున నాలుగు సార్లు మార్కాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక ప్రకాశం జిల్లా వైసీపీలో కీలక నేతగా నడుచుకుంటున్న కొండారెడ్డి, తన తనయుడుకు టికెట్ దక్కేలా చేసుకుని, ఆ ఎన్నికల్లో గెలిపించుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాగార్జున రాజకీయాలకు కొత్త కావడంతో, ఎక్కువ బాధ్యతలు తండ్రి కొండారెడ్డి, నాగార్జున సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి తీసుకుని నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. నాగార్జున సైతం జనంలోకి వెళుతూ, వారి సమస్యలని తెలుసుకుంటూ, వాటికి పరిష్కార మార్గం చూపిస్తున్నారు.
అలాగే ప్రభుత్వ పథకాలు నాగార్జునకు బాగా ప్లస్ అవుతుండగా, నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. నియోజకవర్గంలో ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలల్లో నాగార్జున చురుకుగా పాల్గొంటున్నారు. ఇంకా నాగార్జున ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, తన క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలు వింటూ, వాటిని పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. అయితే మార్కాపురం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఎక్కువగానే ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ఇక్కడ నీటి సమస్యలు తగ్గుతాయి. ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య కూడా ఎక్కువే. అలాగే మార్కాపురంలో నియోజకవర్గంలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. మార్కాపురం డివిజన్‌లో డ్రైనేజ్ సమస్య ఎక్కువగానే ఉంది. ఇవేగాక నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి.
అటు రాజకీయంగా చూసుకుంటే మార్కాపురంలో వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎమ్మెల్యే రాజకీయాలకు కొత్త అయినా సరే, జగన్ ఇమేజ్ వైసీపీకి ప్లస్ అవుతుంది. ఇక టీడీపీ తరుపున కందుల నారాయణరెడ్డి పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడం వల్ల, నియోజకవర్గంలో టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి. ఈయన కాస్త దూకుడుగా ఉంటే మార్కాపురంలో వైసీపీకి టీడీపీ పోటీ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: