హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జోగులు జోరు కొనసాగుతుందా!

శ్రీకాకుళం జిల్లా వైసీపీలో బాగా స్ట్రాంగ్‌గా ఉన్న ఎమ్మెల్యేల్లో కంబాల జోగులు పేరు కూడా ఉంటుంది. రాజాం నుంచి వరుసగా రెండుసార్లు వైసీపీ తరుపున గెలిచి సత్తా చాటుతున్న జోగులు దెబ్బకు, రాజాంలో టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది. అయితే టీడీపీని దెబ్బకొట్టిన జోగులు అదే టీడీపీ నుంచి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. 2004లో తెలుగుదేశం పార్టీ తరుపున పాలకొండ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన జోగులు, 2009లో ప్రజారాజ్యం తరుపున బరిలో దిగి రాజాం నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత జోగులు వైసీపీలోకి వచ్చి, 2014లో స్వల్ప మెజారిటీ తేడాతో ప్రతిభా భారతిపై గెలవగా, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కొండ్రు మురళిపై మంచి మెజారిటీతో గెలిచారు. ఇలా వరుసగా గెలిచిన జోగులు నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రభుత్వం తరుపున జరిగే కార్యక్రమాలని జోగులు యాక్టివ్‌గా చేస్తున్నారు. రాజాం నియోజకవర్గంలో జగనన్న కాలనీలు పేరిట పేదలకు ఇళ్ళు, కొత్తగా రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ కేర్ సెంటర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
అటు ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తూ, సబ్సీడి ద్వారా రైతులకు వ్యవసాయ పరికరాలని అందించే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ నిధులని మంజూరు చేయించుకుని రాజాం పట్టణం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇక నాగావళి నది వద్ద త్రాగునీటి హెడ్ రెగ్యులేటర్‌తో పాటు వంతెన నిర్మించే కార్యక్రమం, గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. రాజాం నియోజకవర్గానికి త్రాగునీరు పెద్ద సమస్య. ప్రధాన రహదారులని విస్తరించాల్సిన అవసరముంది. వంగర మండలంలో కొన్ని గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం కూడా లేదు. సంతకవిటి మండలంలో పలు గ్రామాల్లో సరైన రోడ్డు సౌకర్యం లేదు.
ఇక రాజకీయంగా చూసుకుంటే రాజంలో కంబాల జోగులుకు చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయిన కొండ్రు మురళి అడ్రెస్ లేకుండా వెళ్లిపోగా, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి యాక్టివ్‌గా లేరు. కానీ మాజీ స్పీకర్, తన కుమార్తె గ్రీష్మకు రాజాం టీడీపీ పగ్గాలు ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తానికి చూసుకుంటే రాజాంలో జోగులు జోరు కొనసాగుతుందనే చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: