హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అచ్చెన్నకు చెక్ పెట్టేసినట్లేనా?

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం..టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఎక్కువసార్లు పసుపు జెండానే ఎగిరింది. 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ సైతం ఇక్కడ గెలిచారు. ఇక గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విజయం సాధిస్తూ వస్తున్నారు. గతంలో మూడుసార్లు హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి గెలిచిన అచ్చెన్న...2009లో టెక్కలి బరిలో నిలబడి ఓటమి పాలయ్యారు.
ఇక 2014లో గెలిచి, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2019లో జగన్ వేవ్‌లో కూడా అచ్చెన్న టెక్కలి బరిలో గెలిచారు. అయితే ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కావడంతో నియోజకవర్గంలో పెద్దగా పనిచేయట్లేదు. ఏదో కార్యకర్తల వరకు అచ్చెన్న అందుబాటులో ఉంటున్నారని తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండటంతో, ఎక్కువగా టెక్కలిని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
దీంతో టెక్కలిలో అచ్చెన్నకు కాస్త బలం తగ్గినట్లే కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇక్కడ వైసీపీ తరుపున దువ్వాడ శ్రీనివాస్ దూకుడుగా పనిచేస్తున్నారు. 2009లో ఇదే టెక్కలి నుంచి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిన దువ్వాడ, 2014లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో జగన్ మళ్ళీ దువ్వాడని టెక్కలికి పంపించేశారు. అక్కడే దువ్వాడ పనిచేస్తున్నారు. ప్రజలకు అండగా ఉంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వ పథకాలు దువ్వాడకు ప్లస్ అవుతున్నాయి. ప్రజల సమస్యలని పరిష్కరించడంలో దువ్వాడ ముందున్నారని తెలుస్తోంది.
అయితే ఎమ్మెల్యేగా అచ్చెన్న ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా ఓడిపోతున్న సానుభూతి దువ్వాడకు ఉంది. పైగా అధికారంలో ఉండటం దువ్వాడకు కలిసొచ్చే అంశం. నెక్స్ట్ ఎన్నికల్లో ఇవే అచ్చెన్నకు దువ్వాడ చెక్ పెట్టడగానికి కలిసొచ్చేలా ఉన్నాయి. కానీ టెక్కలిలో అచ్చెన్నని తక్కువ అంచనా వేస్తే కష్టం. ఆయన ఎప్పుడైనా పుంజుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎన్నికల వరకు దువ్వాడ అదే ఊపుతో పనిచేస్తే టెక్కలిలో అచ్చెన్నని నిలువరించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: