హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అదీప్‌కు రామ్మోహన్ బామ్మర్ది చెక్ పెట్టగలరా?
గత ఎన్నికల్లో వైసీపీ తరుపున అనేకమంది యువ నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే. అలా ఎమ్మెల్యేలుగా గెలిచి రెండేళ్లలో నియోజకవర్గాల్లో బాగానే ఫాలోయింగ్ తెచ్చుకున్న యువనాయకుల్లో అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఒకరు. 2019 ఎన్నికల్లో అదీప్ వైసీపీ నుంచి పెందుర్తి బరిలో నిలబడి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయమూర్తిని ఓడించారు. బండారు, రామ్మోహన్ నాయుడు మామ అనే విషయం తెలిసిందే.
ఇలా బండారుని ఓడించిన అదీప్ ఎమ్మెల్యేగా దూసుకెళుతున్నారు. ప్రజలకు అండగా ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు పథకాలు అందేలా చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉంటూ, వారికి ఆర్ధికంగా సాయం అందించారు. అలాగే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు. నియోజకవర్గాలో రోడ్లని అభివృద్ధి చేస్తున్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి. కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు పెందుర్తిలో జరిగాయి.
అయితే పెందుర్తిలో పలు సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కీలకమైన సింహాచలంకు చెందిన భూములు విషయంలో సమస్యలు ఉన్నాయి. పంచగ్రామాలు సమస్య పరిష్కారం కావడం లేదు. అలాగే చిన్న, పెద్ద వ్యాధులకు ఇక్కడ ప్రజలు విశాఖ నగరానికి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ప్రజలకు అవసరాలకు తగ్గట్టుగా ఓ ప్రజా వైద్యశాల నిర్మించాల్సిన అవసరముంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ వేయాలి. అటు గంగవరం పోర్టు విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి.
రాజకీయంగా ఈ నియోజకవర్గంలో అదీప్ స్ట్రాంగ్‌గానే ఉన్నారు. కానీ టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అటు బండారు వారసుడు అప్పలనాయుడు సైతం నియోజకవర్గంలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. అదీప్‌పై అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే బంధువులపై భూ కబ్జాల ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయంగా అప్పలనాయుడు దూకుడుగా ఉంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి అప్పలనాయుడే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అందుకే బండారు వారసుడు పెందుర్తిలో ఫుల్ యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. మరి చూడాలి బండారు ఫ్యామిలీ అదీప్‌కు చెక్ పెట్టగలదో లేదో.