హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధర్మానకు ఈ సారి బెర్త్ ఖాయమేనా?
ధర్మాన ప్రసాదరావు....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న ఈయన, అనేకసార్లు మంత్రిగా కూడా పనిచేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైపోవడంతో, వైసీపీలోకి వచ్చేశారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్ధి గుండా లక్ష్మీ చేతిలో ఓటమి పాలయ్యారు.
అయితే ఓటమి ఎదురైన వెనుదిరగకుండా కష్టపడి నియోజకవర్గంలో పని చేసుకున్నారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా విజయం సాధించగలిగారు. అయితే ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచినా సరే, ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రి పదవి వచ్చింది. అయితే తన సీనియారిటీతో నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. మంచి వక్త కావడంతో అటు అసెంబ్లీ గానీ, మీడియా సమావేశాల్లో గానీ టీడీపీకి చురకలు అంటించడంలో ముందున్నారు.
అటు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మాజీ మంత్రి కావడంతో అధికారులకు చెప్పి ఏ పనైనా చేయించుకోగలుగుతున్నారు. ప్రభుత్వ పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి. ఇక నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణంలో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడాల్సిన అవసరముంది. అలాగే తాగునీటి సమస్య ఎక్కువగానే ఉంది. శ్రీకాకుళం కార్పొరేషన్ స్థాయికి ఎదిగినా, ఆ స్థాయి అభివృద్ధి మాత్రం లేదు. శ్రీకూర్మం, శాలిహుండం, కళింగపట్నం ఈ మూడింటిని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.
ఇక రాజకీయంగా చూసుకుంటే శ్రీకాకుళంలో ధర్మాన బలంగానే ఉన్నారు. జగన్ మళ్ళీ కేబినెట్ విస్తరణ చేస్తే అప్పుడు ధర్మానకు మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అటు టీడీపీ తరుపున గుండా లక్ష్మి ఉన్నారు. ఆమెకు వయసు మీద పడటంతో పెద్ద యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే ధర్మానకు గానీ మంత్రి పదవి వస్తే శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ ఇంకా బలం పడే అవకాశముంది. మరి చూడాలి ధర్మానకు నెక్స్ట్ టర్మ్‌లో మంత్రి పదవి వస్తుందో లేదో?