హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరణంకు ఆమంచితో కష్టమేనా?

కరణం బలరాం...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు చేసిన కరణం, 2019 ఎన్నికల తర్వాత ఊహించని విధంగా వైసీపీ వైపుకు వచ్చేశారు. 2019 ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నుంచి పోటీ చేసి కరణం విజయం సాధించారు. అది కూడా ఆమంచి కృష్ణమోహన్‌పై. ఆమంచి 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి చీరాల నుంచి గెలిచారు.


ఇక ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి రాజకీయాలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా చెలామణి అయ్యి, 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చి చీరాల నుంచి పోటీ చేసి కరణం చేతిలో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత కరణం కూడా టీడీపీని వీడి వైసీపీ వైపుకు వచ్చేశారు. దీంతో కరణం, ఆమంచిలకు అసలు పొసగడం లేదు. నిత్యం ఇక్కడ ఏదో రకంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.


వీరి పంచాయితీ వైసీపీ అధిష్టానం వద్దకు అనేక సార్లు వెళ్లింది. కానీ ఎన్నిసార్లు పంచాయితీ జరిగినా, ఈ నేతల తీరు మారలేదు. దీంతో చీరాల వైసీపీలో రెండు వర్గాలు వచ్చాయి. ఆఖరికి పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో కరణం, ఆమంచి వర్గాలు నువ్వా-నేనా అన్నట్లు తలబడ్డాయి. చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉంటే వైసీపీ 19 వార్డులు గెలుచుకుంటే, ఆమంచి తరుపున రెబల్‌గా పోటీ చేసిన వారు 13 వార్డుల్లో గెలిచారు. ఇక టీడీపీ ఒక వార్డు గెలుచుకుంది.


దీని బట్టి చూసుకుంటే చీరాలలో టీడీపీ సీన్ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఇక్కడ కేవలం కరణం, ఆమంచిలు ప్రత్యర్ధులుగా మారిపోయారు. ఇక వీరి పోరులో నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి తక్కువే. ప్రభుత్వ పథకాలు మామూలుగానే అందుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకరు పోటీ చేస్తే, మరొకరు ఓడించడానికి చూస్తారు. కాబట్టి వీరి పంచాయితీ త్వరగా సెటిల్ చేస్తే చీరాలలో వైసీపీకి మంచి జరుగుతుంది. లేదంటే పిల్లి పిల్లి కొట్టుకుని ఎలుకకు మేలు చేశాయి అన్నట్లుగా, కరణం-ఆమంచిల మధ్య పోరుతో టీడీపీకి లాభం జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: