హెరాల్డ్ ఎమెల్యే ప్రోగ్రెస్: స్పీకర్‌కు బామ్మర్ది చెక్ పెడతారా?

 శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం...తెలుగుదేశంకి కాస్త అనుకూలంగా ఉండే నియోజకవర్గం. ఆ పార్టీ ఆవిర్భావం అంటే 1983 నుంచి జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీనే ఎక్కువసార్లు గెలిచింది. 1983, 1985, 1994, 1999,2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. ఇందులో నాలుగుసార్లు తమ్మినేని సీతారాం టీడీపీ నుంచి విజయం సాధించారు. 2014లో తమ్మినేని బామ్మర్ది కూన రవికుమార్ టీడీపీ నుంచి గెలిచారు. ఇక 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు.


ఇక టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళిన తమ్మినేని సీతారాం 2014లో బామ్మర్ది చేతిలో ఓడిపోగా, 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం ఏపీ స్పీకర్‌గా పనిచేస్తున్నారు. ఓ వైపు స్పీకర్‌గా అసెంబ్లీలో మంచి పనితీరు కనబరుస్తుంటే, మరోవైపు ఆమదాలవలసలో ఎమ్మెల్యేగా అదరగొడుతున్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్న పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై విరుచుకుపడుతూనే, ప్రజలకు అండగా ఉంటున్నారు. అటు పార్టీ పరంగా కూడా ఆమదాలవలసలో తమ్మినేనికి తిరుగులేదు.


ఇక ప్రభుత్వ పథకాలు తమ్మినేనికి బాగా ప్లస్ అవుతున్నాయి. ఇదే సమయంలో టీడీపీలో ఉన్న తమ్మినేని బామ్మర్ది కూన కూడా దూకుడుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడు కూడా అయ్యాడు. దీంతో జిల్లాలో టీడీపీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. అలాగే తన బావ తమ్మినేనికి చెక్ పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ ఉద్యోగాల విషయంలో తమ్మినేని అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. కాకపోతే ఈ దూకుడు తమ్మినేనికి చెక్ పెట్టడం కష్టమే అని తెలుస్తోంది.


అటు నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అనేక ప్రజా సమస్యలున్నాయి. దీనిలో ప్రధానమైనది సాగు, తాగు నీరు. చుట్టూ నాగావళి, వంశధారా వంటి నదులున్నా, ఆ నీళ్లు వీరికి అందుబాటులో లేవు. భూర్జ మండలంలో నారాయణపూర్ బ్యారేజ్‌కి రెగ్యులేటర్ అమర్చి ఆధునీకరించే పనులు దశాబ్దాలుగా ఆలస్యం అవుతుంది. సర్బుర్జీ మండలంలో నాగావళి నదిపై పెందుర్తి దగ్గర వంతెన నిర్మించి, ఆ ప్రాంతానికి తాగునీరు అందించాల్సిన అవసరముంది. ఆముదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో బ్రిడ్జీ నిర్మాణం, ఇంకా మూతబడిన సహకార రైతు చక్కర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని కూడా ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: