హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీకి తిరుగులేదు..టీడీపీకి దిక్కులేదు..

విశాఖపట్నం జిల్లాలో టీడీపీకి కాస్త పట్టున్న నియోజకవర్గాల్లో ఎలమంచిలి ఒకటి. ఆ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి అంటే 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే టీడీపీ ఇక్కడ 6 సార్లు విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ రెండుసార్లు గెలవగా, వైసీపీ ఒక్కసారి విజయం సాధించింది. అయితే కాంగ్రెస్, వైసీపీల నుంచి గెలిచింది ఒక్కరే. టీడీపీ విజయాలకు బ్రేక్ వేసి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు(కన్నబాబు) ఎలమంచిలిలో సత్తా చాటారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రమణమూర్తి, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు.

ఇక 2014లో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన పంచకర్ల రమేష్ బాబు, 2019 ఎన్నికల్లో ఓడిపోయి, ఇప్పుడు వైసీపీలోకి వచ్చేశారు. దీంతో ఎలమంచిలిలో టీడీపీకి దిక్కులేకుండాపోయింది.  అలాగే ఎలమంచిలిలో రమణమూర్తి దూకుడుగా పనిచేస్తుండటంతో వైసీపీకి తిరుగులేదనే చెప్పొచ్చు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి రమణమూర్తి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రజలు రమణమూర్తితో చెబితే పరిష్కారం అయ్యేలా చేస్తున్నారు.

ఇక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానుండటం కలిసొచ్చే అంశం. అలాగే ఎలమంచిలిలోని ఏటికొప్పాక లక్కబొమ్మలు బాగా ఫేమస్ అనే సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన ‘మన్‌ కీ బాత్‌’లో ఈ లక్కబొమ్మలు గురించి ప్రత్యేక ప్రస్తావించడంతో తమ కళకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు వస్తుందని, బొమ్మలకు ఆదరణ పెరుగుతుందని స్థానిక కళాకారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే తీర ప్రాంతం కాబట్టి, ఇక్కడి భూగర్భ జలాలు సైతం ఉప్పగా ఉండటంతో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. జాతీయ ప్రాజెక్ట్ పోలవరం పూర్తయితే, ఈ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందుతుంది. ఎలమంచిలిని పురపాలక సంఘం స్థాయికి పెంచడం వల్ల ఇక్కడ పన్నులు మాత్రం విపరీతంగా పెరిగాయి. పంచదార్ల బౌద్ధారామాలు, రాంబిల్లి తీరాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. అటు కర్మాగారాల నుంచి వెలువడుతున్న వ్యర్ధాలు సమీప సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. దీని వల్ల అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకార తీరం మొత్తం కలుషితమైపోయింది. ఈ కారణంగా మత్స్యకారులకు చేపలు దొరకని పరిస్థితి నెలకొంది. మునగపాక మండలంలో జూనియర్, ఐటిఐ కాలేజీలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: