హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జానారెడ్డి ప్రత్యర్ధికి సెకండ్ ఛాన్స్ ఉంటుందా?





 


జానారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. దశాబ్దాల పాటు తెలంగాణ గడ్డపై రాజకీయాలు చేస్తున్న నాయకుడు. ఎప్పుడో 1978లో జనతా పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన జానారెడ్డి. అప్పుడు చలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక తర్వాత టీడీపీలోకి వచ్చి 1983, 1985 ఎన్నికల్లో గెలిచారు. కానీ తర్వాత కాంగ్రెస్‌లో వెళ్ళిన జానారెడ్డి..1989లో గెలవగా, 1994లో ఓడిపోయారు. ఇక 1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలిచేశారు.
ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి పోటీకి దిగి గెలిచారు. తెలంగాణ వచ్చాక 2014లో కూడా మరొకసారి గెలిచారు. అయితే 2018లో జానారెడ్డికి ఓటమి ఎదురైంది. జానారెడ్డిపై నోముల నర్సింహయ్య విజయం సాధించారు. నోముల గతంలో సి‌పి‌ఐలో పనిచేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్‌లోకి వచ్చి 2014లో నాగార్జున సాగర్‌లో పోటీ చేసి ఓడిపోయారు. 2018లో గెలిచారు. అయితే ఆ మధ్య ఆయన అనారోగ్యంతో మరణించారు. దీంతో నాగార్జున సాగర్‌కు ఉపఎన్నిక వచ్చింది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరుపున నోముల తనయుడు భగత్ పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి మళ్ళీ జానారెడ్డి పోటీ చేశారు. అయితే విజయం భగత్‌ని వరించింది. అయితే నోముల ఎక్కువ ప్రజల మధ్యలోనే ఉండేవారు. తండ్రి బాటలోనే భగత్ కూడా ప్రజల్లో ఉంటున్నారు. కాకపోతే పూర్తిగా ఈయనకు నియోజకవర్గంపై పట్టు లేదు. ప్రభుత్వం నుంచి జరిగే కార్యక్రమాలు మాత్రం అమలు చేస్తున్నారు. పైగా ఉపఎన్నికలో గెలిచాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కేసీఆర్ రూ.150 కోట్ల నిధులు మంజూరు చేశారు.
అలాగే డిగ్రీ కాలేజీ, మిని స్టేడియం కూడా మంజూరు చేశారు. ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయ‌తీరాజ్ రోడ్లు, క‌ల్వ‌ర్ట‌ల నిర్మాణానికి నిధులు ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఉపాధి. చిన్న చిన్న రైస్ మిల్లులు, ఓ ఫార్మా పరిశ్రమ తప్ప పెద్ద పెద్ద సంస్థలు లేవు.  పక్కనే సాగర్ ప్రాజెక్టు ఉన్నా సరే... గ్రామాల్లో తాగునీటికి, సాగునీటికి తీవ్ర ఇబ్బందులున్నాయి.
రాజకీయంగా చూస్తే...టీఆర్ఎస్‌కు అధికార బలమే ఉంది. కానీ జానారెడ్డికి కింది స్థాయి నుంచి బలం ఉంది. ఆయన త్వరగానే పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని చెప్పేశారు. మరి ఆయన తనయుడు పోటీ చేస్తారేమో చూడాలి. ఏదేమైనా ఈ సారి సాగర్‌లో జానారెడ్డి ఫ్యామిలీ సత్తా చాటేలా ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: