హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పద్మావతి దూకుడు...శ్రావణి సైలెంట్..

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో శింగనమల కూడా ఒకటి...అయితే ఇది 2019 ఎన్నికల ముందు వరకే..2019 ఎన్నికల తర్వాత నుంచి వైసీపీ అడ్డాగా మారిపోయిందనే చెప్పొచ్చు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరుపున భారీ మెజారిటీతో గెలిచిన జొన్నలగడ్డ పద్మావతి దూసుకెళుతున్నారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికీ రెండున్నర ఏళ్ళు అయింది. మరి రెండున్నర ఏళ్లలో పద్మావతి పనితీరు ఎలా ఉంది? ప్రజలకు ఆమె ఎంతవరకు అండగా ఉంటున్నారు? రాజకీయంగా ఎంత బలంగా ఉన్నారు? అనే అంశాలని ఒకసారి చూస్తే...ఎమ్మెల్యేగా పద్మావతికి మంచి మార్కులే పడుతున్నాయని చెప్పొచ్చు.
ఏదో ఎమ్మెల్యేగా గెలిచేశామని ప్రజల్లోకి వెళ్లకుండా ఉండకుండా...నిత్యం వారి మధ్యలోనే ఉంటూ....ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సాధ్యమైన మేర నిధులు తెచ్చుకుని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగాయి. అలాగే జగనన్న కాలనీల పేరిట పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం...నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొత్తగా వాటర్ ట్యాంకులు, సి‌సి రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వ పథకాల అమలులో పద్మావతి ఎలాంటి లోటు రానివ్వడం లేదు.
అయితే ఇక్కడ పలు సమస్యలు కూడా ఉన్నాయి. ఇటీవల వరదలకు నియోజకవర్గాల్లో ఆస్తి, పంట నష్టం ఎక్కువగానే జరిగింది. పద్మావతి ప్రజల దగ్గరకు వెళ్ళి భరోసా ఇస్తున్నారు గానీ, ఆర్ధికంగా కూడా భరోసా ఇవ్వాల్సి ఉంది. వరదలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. అటు పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇక వేసవి కాలం వస్తే నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువే. ఇక ఎమ్మెల్యే బంధువులు అక్రమాలు ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. ఇసుక, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు ఎక్కువ చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఇటు రాజకీయంగా చూసుకుంటే ప్రస్తుతం పద్మావతి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఆధిక్యం దక్కేలా చేసుకున్నారు. అటు టీడీపీ తరుపున బండారు శ్రావణి పనిచేస్తున్నారు. మొన్నటివరకు ఆమె దూకుడుగానే పనిచేశారు. కానీ ఇటీవల సైలెంట్ అయ్యారు. తన నియోజకవర్గంపై కాల్వ శ్రీనివాసులు పెత్తనం పెరగడం...దళిత నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఈ విషయాన్ని టీడీపీ అధిష్టానం కూడా పట్టించుకోకపోవడంతో..శ్రావణి పూర్తిగా సైలెంట్ అయ్యారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ వెనుకబడింది. మొత్తానికైతే శింగనమలలో పద్మావతి దూకుడు కొనసాగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: