హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: లక్ష్మీపార్వతి గెలిచిన చోట...వైసీపీ ఎమ్మెల్యే సత్తా చాటుతున్నారా?
శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లో పాతపట్నం ఒకటి. ఇక్కడ తెలుగుదేశం ఎక్కువసార్లే గెలిచింది. 1983, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది. ఇందులో నాలుగుసార్లు కలమట మోహన్ రావు గెలిచారు. అయితే 1994లో మోహన్ రావు దేవుడు ఫోటో పెట్టుకుని ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారని చెప్పి, ఎన్నికల సంఘం ఆయనపై వేటు వేసింది. దీంతో 1996లో పాతపట్నం స్థానానికి ఉపఎన్నిక వచ్చింది.
ఆ ఉప ఎన్నికలో టీడీపీ తరుపున మోహన్ రావు భార్య వేణమ్మ పోటీ చేయగా, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి లక్ష్మీపార్వతి పోటీ చేశారు. ఇక విజయం లక్ష్మీపార్వతినే వరించింది. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మోహన్ రావు టీడీపీ తరుపున సత్తా చాటారు. ఇక మోహన్ రావు వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన కలమట వెంకటరమణ మూర్తి 2009లో పాతపట్నంలోనే టీడీపీ తరుపున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్ధి శతృచర్ల విజయరామరాజు చేతిలో ఓడిపోయారు.
అయితే శతృచర్ల టీడీపీలోకి రావడంతో, కలమట వైసీపీలోకి వెళ్లారు. 2014లో వీరే మళ్ళీ రివర్స్‌లో పోటీపడ్డారు. కానీ విజయం వెంకటరమణని వరించింది. ఆ తర్వాత వెంకటరమణ మళ్ళీ టీడీపీలోకి వచ్చేశారు. 2019లో టీడీపీ తరుపున పోటీ చేసి, వైసీపీ నుంచి బరిలో దిగిన రెడ్డి శాంతి చేతిలో ఓడిపోయారు.
ఇక ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి బాగానే పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగకపోయిన, ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రం చురుకుగా సాగుతున్నాయి. జగనన్న కాలనీల శంఖుస్థాపనలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఓపెనింగ్, నాడు-నేడు ద్వారా అభివృద్ధి చెందిన పాఠశాలలకు రిబ్బన్ కటింగ్‌లు జరుగుతున్నాయి.
అలాగే వంశధార ప్రాజెక్టు ఆయువు పట్టు అయిన ప్రతిపాదిత నేరడి బ్యారేజ్ నిర్మాణం జరగనుంది. అటు వంశధార నిర్వాసితులని ఆదుకోవాల్సిన అవసరముంది. వంశధార నదికి సరైన కరకట్ట లేకపోవడం వల్ల చుట్టుపక్కల  ఉన్న గ్రామాల్లో వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నాయి. పాతపట్నంలో డ్రైనేజ్ సమస్య ఉంది. గ్రామాల్లో సరైన రోడ్ల సౌకర్యం లేదు.
రాజకీయంగా చూసుకుంటే తమ కంచుకోటని తిరిగి దక్కించుకోవడానికి వెంకటరమణ గట్టిగానే కష్టపడుతున్నారు. నియోజకవర్గంలో వైసీపీకి ధీటుగా టీడీపీని బలోపేతం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా సొంతంగా ఇమేజ్ లేకపోవడం, జగన్ ఇమేజ్ ఆధారపడటం మైనస్ అవుతుంది. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో పాతపట్నం ఫలితం ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: