మహభారతం పాత్రల వ్యక్తిత్వ విలువలు - నేటికీ సజీవం



భీముడు కు అంతులేని బాహుబలం ఉంది. కావలసిననత కండబలమూ ఉంది. కానీ ఇసుమంతైనా బుద్ధిబలం లేదు. ప్రతీదానికి ఆవేశపడతాడు. "కొట్టేస్తా, చంపేస్తా, చీరెస్తా, నరికేస్తా"  అంటూ ఊగిపోతూ ఉంటాడు. ఎలా కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి - మన చేతికి మట్టీ అంటకుండా కొట్టాలి కదా! ఇటువంటి ఆలోచనలు ఏమీ రావు. చేతిలో గద ఉన్నంత సేపూ దురదే! కీచకుడ్ని చంపటానికి చెట్టూ పీకి  సన్నద్ధమవుతాడు భీముడు.

పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు. కీచకుడు మరణించాడంటే భీముడే చంపి వుంటాడని తెలిసి పోతుంది. అజ్ఞాత వాసం బయట పడుతుంది. అలా జరిగితే మరల అరణ్య వాసం చెయ్యాల్సివస్తుంది. ఇదేమీ అలోచించడు భీముడు. ధర్మరాజు వచ్చి శాంతింపజేయాలి.


మనం భీముని లాంటి ఆవేశపరుల్ని, సందు దొరికితే తగాదాకి వెళ్ళి సమస్యల్ని తెచ్చిపెట్టే వాళ్ళనీ చూస్తూ ఉంటాం. కేవలం పరాక్రమం, ఆవేశం మాత్రమే కాదు - ఆలోచన కూడా ఉండాలని భీముడి ద్వారా తెలుసుకుంటాం. 




కీచకుడు స్త్రీ లోలుడు. చీర కొంగు కనిపిస్తే ఆగలేడు. ద్రౌపది సైరంధ్రిగా - దాసీగా ఉంది. ఆమె మీద కన్నేసాడు. సోదరి చెప్పనే చెప్పింది - అది దాసీది, దానితో ఏమిటి? అని. కానీ కీచకుడు వినలేదు- స్త్రీ వ్యామోహం ఉన్న వాడి స్వభావమే అది. రాత్రిపూట రహస్యంగా రమ్మంది ద్రౌపది. కీచకుడు విరాటరాజు బావమరిది. గొప్ప స్థాయిలో పదవిలో గౌరవంగా ఉండ వలసినవాడు - రాత్రిపూట రహస్యంగా ఒక స్త్రీ కోసం అగచాట్లు పడ్డాడు. తన స్థాయికి తగని పని చేశాడు. పరస్త్రీ సంగమం కోరుకోనేవాడు ఉచ్చ నీచాలు మరచాడు. నీచ బుద్ధి ఇతరత్రా పనిచెయ్యదు. ఇదీ కీచకుని వ్యక్తిత్వం. 


ఇవాళ సమాజంలో ఇటువంటి కీచకుల్ని ఎంతమందిని చూడటంలేదు? దినపత్రికలు తిరగేస్తే ఎంతోమంది కీచకుల గురించి తెలుస్తుంది.


ఇలా చెప్పుకుంటూ పోతే - మహాభారతంలో ప్రతి పాత్ర మానవ వ్యక్తిత్వానికి ప్రతీక. ధర్మరాజు, భీముడు, కీచకుడు, దుర్యోధనుడూ. కర్ణుడు మాత్రమే ....కాదు ఆ పాత్రల్లో నిబిడీకృతమై మనమే ఉన్నాం. మానవ బుద్ధులే ఉన్నాయి. మన అంతరంగాలే ఆ పాత్రలలో నిక్షిప్తమై ఉన్నాయి. వీటిని లోతుగా పరిశీలిస్తే వ్యక్తిత్వానికి కావలసినంత "సరుకు" దొరుకుతుంది. సృష్ఠికర్త వేదవ్యాసుడు సహస్ర సహస్రాబ్ధాలనాడు రాసిన పాత్రలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: