మహాభారతం లో ఒక గుణపాఠం: కర్ణ - కృష్ణ - అర్జున కథ



మహాభారతములో శ్రీకృష్ణ భగవానుడే కథానాయకుడు. భూభారాన్ని తగ్గించటానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు, దర్శకత్వం వహించిన కురుక్షెత్ర యుద్ధం అన్నింటా "దుష్టశిక్షణ  శిష్టరక్షణ" ప్రధానమైన అంశాలుగా ఉన్నాయి. అయితే ఆయన కొందరికి గుణపాఠాలు మరికొందరికి జీవితపాఠాలూ నేర్పారు. సర్వులకు తెలిసిన జీవిత పాఠం భగవద్గీత. అయితే గుణపాఠం అనేదానికి మాత్రం క్రిందికథే ఉదాహరణ.



 

కర్ణుడు అనగానే దానాలు చేసేవాడని అందరికీ తెలుసు. అందుకే, ఆయనకు దానకర్ణుడు అని పేరు వచ్చింది. అయితే, ఎప్పుడూ కర్ణుడిని కృష్ణుడు దానకర్ణుడు అని అభివర్ణించేవాడు. ఇలా కృష్ణుడు అనడం అర్జునుడికి ఏమాత్రం నచ్చలేదు. అప్పుడప్పుడూ కృష్ణుడితో అర్జునుడు వాదనకు దిగేవాడు. ఈ విషయమై, వీరి మధ్య చాలా సేపే మాటల యుద్ధం జరిగేది. ఈ మాటలు ఇలాగే సాగితే పరిస్థితి ఏమాత్రం బాగుండదనుకున్న కృష్ణుడు ఒక ఆలోచనకు వస్తాడు. కృష్ణుడు తన మహిమలతో వెంటనే ఒక బంగారు పర్వతాన్ని సృష్టించాడు. అప్పుడు అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు. ఆ బంగారు పర్వతాన్ని ఈ రోజు సాయంత్రం లోపల ఒక్క ముక్క మిగల్చకుండా దానం చెయ్యాలి. అలా నువ్వు చేస్తే నేను నిన్ను దానం చేయడంలో కర్ణుడి కన్నా గొప్ప వాడిగా చెబుతాను కొనియాడుతాను సరేనా?  అని అంటాడు.




అర్జునుడు ఈ విషయాన్ని ఊరు ఊరంతా ప్రచారం చేయిస్తాడు. తాను బంగారు పర్వతాన్ని దానం చేయబోతున్నాను అని అంటాడు. ప్రజలందరినీ రమ్మంటాడు. అలాగే అందరూ వస్తారు. బంగారాన్ని ముక్కలు చేసి దానం చెయ్యడం ప్రారంభిస్తాడు అర్జునుడు. మధ్యలో ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా అర్జునుడు దానం చేస్తూనే ఉంటాడు. అయినా వరస తగ్గుతోంది కాని బంగారం ఇంకా మిగిలే ఉంటుది. కృష్ణుడు చెప్పినట్టు ఆ రోజు సాయంత్రం లోపల అర్జునుడు దానం చెయ్యలేకపోతాడు. సగం కూడా దానం చెయ్యలేదు.




ఇంతలో అటువైపుగా వెళ్తున్న కర్ణుడిని కృష్ణుడు పిలిచి, ‘కర్ణా!…ఈ బంగారు పర్వతాన్ని రేపు ఉదయం లోపు దానం చెయ్యాలి…నీ వల్ల అవుతుందా‘ అని అడుగుతాడు. కర్ణుడు ‘అదేం పెద్ద పని కాదే, ఇదంతా దానం చెయ్యాలి అంతేగా ‘ అంటూ కర్ణుడు అటు వచ్చిన ఇద్దరిని పిలిచి ‘ఈ బంగారు పర్వతాన్ని మీ ఇద్దరికీ దానం చేస్తున్నాను…దీనిని మీరిద్దరూ సరిసమానంగా పంచుకుని ఉపయోగించుకోండి’ అని వారిద్దరికీ ఆ బంగారాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కర్ణుడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని చూసి ‘ఇప్పుడు నీకు, కర్ణుడికి మధ్య ఉన్న తేడా తెలిసిందా…? ఈ బంగారు పర్వతాన్ని పూర్తిగా ఇచ్చేయాలనే ఆలోచన రానే లేదు. మరి నిన్ను దానం చేయడంలో కర్ణుడిని మించిన వాడివని ఎలా కొనియాడను’ అని ప్రశ్నిస్తాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడి ఏమాత్రం నోరుమెదపలేదు. “అనేక మందిలో ఒక్కొక్కరి గుణం ఒక్కో విధంగా ఉంటుంది. ఎవరి ప్రత్యేకత వారిది. కర్ణుడు దానం చేయడంలో దిట్ట” అని కృష్ణుడు పేర్కొంటాడు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: