హెరాల్డ్ ఫ్లాష్ 2021 : నా స్వ‌ప్న లోక సాక్షాత్కారం అదిగో.. వెల్కం చెప్పండ్రా!

RATNA KISHORE
నిద్ర‌ను వెలివేసిన రోజు ఒక‌టి ఉంటుంద‌ని విన్నాను..నిద్ర‌నే కాదు ప్ర‌పంచాన్నే వెలివేసిన రోజొక‌టి ఉంటుంది కూడా! అనాథ అయిన కొన్ని సంద‌ర్భాల‌లో మ‌నం ఎవ‌రినో వెతుక్కోవాలి. త‌ల్లీ తండ్రీ వ‌చ్చి మార్గం ఇస్తూ వెళ్తారు..మార్గ బోధ చేసి వెళ్తారు.. మీరు ఈ ఏడాదిలో ఏం సాధించారు అన్న ఒక ప్ర‌తిపాదిత ప్ర‌శ్న ఎంత గొప్ప‌దో! వ‌స్తున్న కాలంలో ఏమీ కోరుకోకూడ‌దు అన్న‌ది సాధించాను అని చెప్పాలి అంద‌రూ!

కాలం మ‌న కోరిక‌ల‌ను నెర‌వేర్చాల‌న్న హ‌క్కు ను క‌లిగి ఉండదు.. ఎవ‌రి విశ్వాసం అయినా ప్ర‌తిభాపూర్వ‌క సంపత్తి నుంచి వెల్ల‌డిలో ఉంటుంది.. ఆ విశ్వాస‌మే బాధ్య‌తతో ముందున్న కాలంలో ప‌నిచేసేందుకు సాయం చేస్తుంది. అప్పుడు కాలం ద‌గ్గ‌ర విజేతలం.. అప్పుడు క్యాలెండ‌ర్ ద‌గ్గ‌ర మ‌న రోజు ఒక‌టి మార్క్ అయి ఉంటుంది. మ‌నం విశ్వాసాన్ని నిల‌బెట్టే క్ర‌మంలో ఇత‌రుల న‌మ్మ‌కాల‌కు ప్రాతిప‌దిక‌గా నిలిచిన రోజులు వెతికిన సంద‌ర్భంలో గెలిచినా ఓడినా ఏమ‌యినా కూడా నిరంత‌ర ప్ర‌య‌త్నం ఒక‌టి గ‌త కాలంకు అందించి వెళ్లాలి..ముందున్న కాలం అందుకు కొన‌సాగింపు అయి లోకం మెప్పున‌కు కార‌ణం అయ్యే ఓ ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌తినిధిగా మిమ్మ‌ల్ని ఉంచుతుందీ స‌మ‌యం మ‌రియు సంద‌ర్భం కూడా!

ఏడాదిలో రెండు తీవ్ర తుఫానులు చూశాక.. మా ప్రాంతం ఏమ‌యిపోతుందో అన్న భ‌యం.. మా ప్రాంతం అంటే శ్రీ‌కాకుళం అని అర్థం.. కేవ‌లం అర్థ‌మే కాదు ఆర్త‌నాదం కూడా! అర్థం నా అస్తిత్వ గొంతుకకు ఆలంబ‌న అయి నిర్వ‌చితం అయింది. ఆర్త‌నాదం నా లోప‌లి ప్ర‌పంచానికి క‌ల్లోలితాలు అందించి కాల్ప‌నిక ధోర‌ణుల్లో జీవితాన్ని విశ్వ‌సించ‌వ‌ద్ద‌ని నేర్పింది. క‌నుక రెండు తీవ్ర తుఫానులు వ‌ద్ద నేను ఆగిపోయాను. స‌ర్! మా ఊరు కూడాబాలేదు.. భారీ వ‌ర్షాల‌కు నాలుగు జిల్లాలు అత‌లాకుత‌లం అయిపోయాయి.. మీరు రాయాలి.. అన్న గొంతుక సీమ నేల నుంచి వ‌చ్చింది.

అవును! భారీ వ‌ర్షాల‌కు చిత్తూరు, అనంత‌పురం,క‌డ‌ప వీటితో పాటు నెల్లూరు వ‌ణికి పోయాయి..మృత్యుగీతం విన్నాయి.. అల‌సిసొల‌సిన ఆ గుండెల‌కు ఆద‌ర‌వు కావాలి..ఆలంబన కావాలి.. వాటి కోసం వెతికాడితే మా ఇంఛార్జ్ టాలీవుడ్ పెద్ద‌ల బాధ్య‌త‌ను ప్ర‌శ్నించ‌మ‌న్నారు.. త‌ప్ప‌కుండా అని రాశాను.. ఇంకా ఎన్నో రాశాను.. ప్రేమ నిండిన స్వ‌రంతో చేసిన ప్రార్థ‌న‌కు స‌మూహ గొంతుక ఎంత‌టి ఆవశ్య‌క‌త‌ను  చాటుతుందో ఎంత గొప్ప ప్ర‌శాంత చిత్తానికి ఆవిష్క‌ర‌ణ అవుతుందో నేర్పేను..ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న ఆ ప్రాంతాల‌కు మ‌న ప్ర‌జాప్ర‌తినిధులు సాయం చేస్తే.. కొట్టుకు పోయిన ర‌హ‌దారుల‌ను పున‌రుద్ధ‌రిస్తే అదే గొప్ప విజ‌యం.. అదే స్వ‌ప్న‌లోక సాక్షాత్కారం.. నా సీమకు.. నా శ్రీ‌కాకుళంకు అదే గొప్ప వ‌రం వ‌ర్ఛ‌స్సు కూడా!
ఫొటో : దండ చిన్నారావు,  తామాడ గ్రామం,  లావేరు మండ‌లం, శ్రీ‌కాకుళం 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: