చిరు ధాన్యాలకు పెరిగిన ఆదరణ!

N.Hari
కరోనా.... లైఫ్ స్టైల్‌తో పాటు ఆహారపు అలవాట్లను మార్చేసింది. జంక్ ఫుడ్‌ను ఇష్టపడేవారు సైతం హెల్త్ ఈజ్ వెల్త్ అంటూ పోషకాహారాలు ఉన్న ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. టేస్ట్‌ కన్నా ఆరోగ్యమే మహాభాగ్యమంటూ నగరవాసులు మిల్లెట్స్ ఫుడ్‌ను తెగ లాగించేస్తున్నారు. సిటీ వాసుల టేస్ట్ కు అనుగుణంగా నగరంలో కొత్త కొత్త హోటల్స్ పుట్టుకొస్తున్నాయి. సర్వేలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు మిల్లెట్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇక్రిసాట్ సర్వేలో తేలింది. అందులో సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, జొన్నలు, ఊదలు, వరిగలు, అరికెలు వంటివి అత్యధికంగా తింటున్నారు.
మధుమేహం, ఉబకాయం సమస్యలు ఉన్నోళ్లు తప్పనిసరిగా చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు కూడా సూచించడంతో జనాలు మిల్లెట్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ చిరుధాన్యాల వినియోగం ఎక్కువగా పట్టణాలకే పరిమితమవుతోంది. ఇక్రిసాట్ అనే సంస్థ వివిధ రాష్ట్రాల్లో సుమారు 15,500 మందిపై అధ్యయనం నిర్వహించింది. అందులో 58 శాతం మంది ఆరోగ్యంగా ఉండేందుకు, మరో 15 శాతం మంది బరువును తగ్గేందుకు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. 38 శాతం మంది మారుతున్న జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకునేందుకు మిల్లెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారని తేలింది.
ట్రెండ్ కు తగ్గట్టుగా జనాల ఇష్టాన్ని గమనించిన కొందరు హోటళ్ల నిర్వాహకులు సరికొత్త థీమ్స్‌తో రెస్టారెంట్లను ప్రారంభిస్తున్నారు. తక్కువ ధరలోనే పసందైన మిల్లెట్స్ ఆహారాన్ని అందిస్తున్నారు. వినియోగదారులు కూడా చిరుధాన్యాలతో చేసిన టిఫిన్స్‌ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, ఊదలు, సామలు, అరికెలు, వరిగల్ వంటి చిరుధాన్యాలతో చేసిన  ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇదే సరైన మార్గమని వారు భావిస్తున్నారు.  యువత సైతం జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ.. మిల్లెట్స్ ఆహారానికి దగ్గరవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: