ముగిసినతుంగభద్ర పుష్కరాలు

Vasu
ముగిసిన తుంగభద్ర పుష్కరాలు

పుష్కరుడికి సారెతో సాదర వీడ్కోలు12 రోజుల్లో 4లక్షల మంది పుణ్య స్నానాలు


తుంగభద్ర పుష్కరాలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. పుష్కరుడికి సారె సమర్పించి సాదరంగా వీడ్కోలు పలికారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, కలెక్టర్‌ శ్రుతిఓఝా, అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌లు తుంగభద్ర నదికి హారతులు సమర్పించారు. ఉత్సవ ముగింపు కార్యక్రమం కనువిందు చేసింది. ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది.

చివరి రోజు(మంగళవారం)న జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు పుష్కరఘాట్లలో 56,194 మంది భక్తులతో కలిపి.. 12 రోజుల్లో మొత్తం 4,09,981 మంది పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అలంపూర్‌కు నాగర్‌కర్నూలు ఎంపీ రాములు, ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం, పుల్లూరు ఘాట్‌కు మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకట్రావు, పలువురు ప్రముఖులు  వచ్చారు. 


పుష్కరాల ఆఖరి రోజున అపశ్రుతి చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా పుసులూరు బొల్లారానికి చెందిన శ్రీనివాసులు, నర్సమ్మ దంపతుల కుమార్తె మైత్రి(11), గొందిమల్ల గ్రామానికి చెందిన రవికుమార్‌, లీలావతి కుమార్తె దీక్షిత(10) మంగళవారం గొందిమల్ల దగ్గర నదిలోకి పుష్కరస్నానానికి వెళ్లారు.  నదిలో గుంతలు ఉండటం గమనించని చిన్నారులూ నీట మునిగి మృతి చెందారు. ర్యాలంపాడు దగ్గర నదిలో మునిగి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.



విజయవంతంగా నిర్వహించాం: అల్లోల

కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల్లోనూ తుంగభద్ర పుష్కరాలను విజయవంతంగా నిర్వహించామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. అధికార యంత్రాంగం  సహనం కోల్పోకుండా సమర్థంగా విధులు నిర్వహించిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: