ప్రపంచ చరిత్రలో అత్యంత పూరాతన నాగరికతల్లో ఒకటైన సింధు నాగరికత గురించి తెలుసుకోగలిగింది ప్రస్తుతం మన పాకిస్థాన్ దేశంలో భాగమైన మొహంజదారో , హరప్పా నగరాల అవశేషాల ద్వారానే. ఆ రోజుల్లో వారి జీవనశైలి మరియు పలు విషయాలను గురించి వివరంగా తెలిపడంలో ఈ చారిత్రక ఆధారాలు బాగా ఉపాయోగపడుతున్నాయి.
మన దేశంలో చారిత్రిక ఆధారాల పరిశోధన కోసం ఏర్పడిందే "ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా"(A.S.I) సంస్థ . ఈ సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి అక్కడ దొరికిన చారిత్రిక అవశేషాల పై పలు పరిశోధనలు చేస్తారు. అటువంటి తవ్వకాల కార్యక్రమంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ని భాగపట్ జిల్లా సినౌలి గ్రామంలో తవ్వకాలు జరపగా అక్కడ లోహ యుగం నాటి రథాలు, ఆభరణాలు, సమాధులు, ఖడ్గాలు, బాకులు మరియు పలు వస్తువులు బయటపడ్డాయి.
అసలు ఈ గ్రామంలో నే అధికారులు తవ్వకాలు జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే 2005 సంవత్సరం లో ఈ గ్రామ రైతులకు తమ పొలాలను సేద్యం చేస్తున్న సమయంలో పొలంలో కుండ పెంకులు, ప్రాచీన మానవ అస్థిపంజరాల అవశేషాలు కనిపించాయి. ఆ విషయం తెలుసుకున్న ఆర్కియాలజిస్టులు హుటాహుటిన ఆ ప్రాంతాన్ని పరీక్షించేందుకు గ్రామానికి తరలివచ్చారు.
అధికారులు గ్రామస్తులు వాటి అవశేషాలు చూపించిన చోట తవ్వకాలు జరపగా ఆ తవ్వకాల్లో ఏకంగా 126 మంది అస్థిపంజరం అవశేషాలు, పూసల హారాలు, రాగి చెవి దిద్దులు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. వాటిని తమ పరిశోధనశాలలో పరిశీలించగా అవి సుమారు 4000 ఏళ్ల కిందటివి అని తేలింది. అంతేకాకుండా గ్రామస్తులు వ్యవసాయం చేస్తున్న ఆ భూములు ప్రాచీన కాలంలో శ్మశానవాటిక అని కూడా తేలింది.
ఎప్పుడైతే అవి బయట పడ్డాయో అప్పటినుంచి సినౌలి గ్రామం పూర్తిగా ఆర్కియాలజి శాఖ ఆధీనంలో కి వెళ్ళింది. అప్పటి నుండి ఆ గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు ఒక మినీ అట్రాక్షన్ గా మారిపోయింది. ప్రతి రోజు అక్కడ అధికారులు పర్యవేక్షణలో పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. ఈ తవ్వకాల్లో ఇప్పటి వరకు 8 శ్మశానవాటికలు బయటపడ్డాయి. ఆ శ్మశానవాటికల్లో రథాలు దొరికిన చోటును రాజవంశీకుల శ్మశానవాటికగాను, మిగిలినవి యుద్ధ సమయంలో అమరులైన వీరుల శ్మశానవాటికలుగా పేర్కొన్నారు ఆర్కియాలజి అధికారులు. ఇక్కడి అవశేషాలు చూస్తుంటే చాలా పూరాతనమైన నాగరికతలకు దగ్గరగా ఉన్నాయి.
లోహ యుగాలకు చెందిన వస్తువులు లభ్యం కావడంతో ఆ ప్రాంతం యొక్క చరిత్ర ,సంస్కృతుల గురించి పరిశోధించేందుకు ఆర్కియాలజిస్టులకు మరిన్ని అవకాశాలు లభించాయి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే భారత దేశంలో తొలిసారిగా రాగి పూతతో నెయ్యబడిన చిత్రాలు, పూలతో ఉన్న శవపేటికలు అని పేర్కొన్నారు. ఇవే గాక ఖడ్గాలు , బాకులు మరియు పలు యుద్ధ రంగంలో వాడిన వస్తువులు చూస్తుంటే అప్పటి వారి కళా నైపుణ్యం గురించి ఎంత పొగిడిన తక్కవే అనిపిస్తుంది. ఇక్కడ దొరికిన ఈ వస్తువులు హరప్పా లో దొరికిన వస్తువులకు దగ్గరగా ఉన్నాయి అని పేర్కొన్నారు.