స్వామి వివేకానంద : భార‌త జాతి ఘ‌న‌తను ప్ర‌పంచానికి చాటిన ప్ర‌సంగం

Paloji Vinay
జ‌న‌వ‌రి 12 వ తేదిన భార‌త ప్ర‌భుత్వం జాతీయ యువ‌జ‌న దినోత్స‌వంగా జ‌రుపుతోంది. భార‌త మాత ముద్దు బిడ్డ, యోగి స్వామి వివేకానంద జ‌యంతిని జాతీయ యువ‌జ‌న దినోత్స‌వంగా భార‌త ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. అయితే, వివేకానందుడి గురించి ఎక్క‌డ విన్నా, చూసిన 1893 సెప్టెంబర్ 11వ తేదీన చికాగో లో జరిగిన ప్రపంచ మత సమ్మేళనం స‌మావేశంలో ఆయన చేసిన ప్రసంగం తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఒక్క ప్ర‌సంగం భార‌త జాతి ప్ర‌తిష్ట ఖండ‌ఖండాంత‌రాల‌కు వ్యాప్తి చెందేలా చేసింది. స్వామి వివేకానంద అమెరికా బ్ర‌ద‌ర్స్ అండ్ సిస్ట‌ర్స్ అంటూ రోమాలు నిక్క‌బొడ‌వాల్సిందే చేసిన‌ ప్ర‌సంగంలో ఆయ‌న‌ ఏం చెప్పారంటే..

 ``అమెరికా సోదర, సోదరీమణులారా.. నన్ను ఆహ్వానించడంలో మీరు చూపించిన ఆత్మీయత నా హృదయం నింపేసింది. ప్రపంచంలోని అత్యంత పురాతన సంస్కృతికి నెలవు అయిన‌, అన్ని ధర్మాలకూ త‌ల్లి అయిన భారతదేశం తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్ని కులమతాలకు చెందిన కోట్లాది మంది భారతీయులంద‌రి త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు` చెబుతూ స్వామి వివేకానంద త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. మతసహనం అన్న భావన తూర్పు దేశాల నుంచి వచ్చిందని ఈ సదస్సులో వెల్లడించిన వక్తలకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను.

     మతసహనం, అన్ని మతాల పట్ల సమాన ఆదరణ లాంటి లక్షణాలను ప్రపంచానికి చాటి చెప్పిన మతం నుంచి ఇక్క‌డకు వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. మేం కేవలం మతసహనాన్ని నమ్మడం మాత్ర‌మే కాదు, అన్ని ధర్మాలను స్వీకరించి ఆరాధిస్తాం. అన్ని మతాలకు, అణగారిన ప్రజలందరికీ ఆశ్రయం క‌ల్పించి దేశానికి చెందిన వాడిని అయినందుకు గ‌ర్వంగా ఉంది. రోమన్ నిరంకుశ పాలకులు ఇజ్రాయిలీయుల పవిత్ర స్థలాలను ధ్వంసం చేశారు. ఆ స‌మ‌యంలో దక్షిణ భారతదేశంలో తలదాచుకున్న ఇజ్రాయిలీయుల‌ను మా హృదయాలకు హత్తుకున్నాం.

     పార్సీ మతం వారికి ఆశ్రయం ఇచ్చిన మతానికి చెందిన వ్య‌క్తిని అయినందుకు నేను గర్వ‌ప‌డుఉన్నాను. మేం ఇప్పటికీ వారికి సహాయం అంద‌జేస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా నా చిన్ననాటి నుంచి వింటున్న, అనేక లక్షల మంది ఇప్ప‌టికీ చెప్పే మాటలను గుర్తు చేయాల‌నుకుంటున్నాను.. 'వివిధ ప్రాంతాలలో పుట్టిన న‌దులు, వివిధ భూభాగాల గుండా ప్రవహించి, చివరకు సముద్రంలో ఎలాగైతే కలుస్తాయో..  అదే విధంగా మనిషి కూడా తనకు నచ్చిన దారిని ఎంచుకుంటాడు.. చూడడానికి ఆ దారులు వేర‌యినా.. అవన్నీ భ‌గ‌వంతుడి ద‌గ్గ‌ర‌కే చేరుకుంటాయి.''

      ఇక్కడ జరుగుతున్న ఈ మత సమ్మేళనం అత్యంత పవిత్రమైనది. గీతలో చెప్పిన విధంగా, ''నా దగ్గరకు వచ్చినది ఏదైనా, అది ఎలాంటిది అయినా..  దానిని స్వీకరిస్తాను. మనుషులు వేర్వేరు దారులను చూసుకున్న‌ప్ప‌టికీ.. కష్టాలను చ‌విచూస్తారు. కానీ, చివరాఖ‌రుకు నన్నే చేరుకుంటారు'' అన్న వాక్యాలు దీనికి నిదర్శనమైన‌వి. మతతత్వం, మూఢ భక్తి, దాని పర్యవసానాలు, అవి సృష్టించిన హింసతో ఈ భూమిపై ఉన్న మట్టి ఎర్రబడి, పీడిస్తున్నాయి.. వాటి కారణంగా ఎన్నో నాగరికతలు నాశనమయ్యాయి, ఎన్నో దేశాలు నామరూపాలు లేకుండా మ‌ట్టిలో క‌లిసిపోయాయి. ఆ భయానకమైన మతతత్వం, మూఢభక్తి లేక‌పోతే మానవ సమాజం ఇంతకన్నా మెరుగైన స్థాయిలో ఉండుండేది. ఈ సర్వమత సమ్మేళనం వేధిక‌గా - అది కరవాలం ద్వారా కావచ్చు, కలం తో అయినా కావచ్చు..  అన్ని రకాల మూఢభక్తిని, పిడివాదాన్ని, హింసను దూరం చేస్తుందని విశ్వసిస్తున్నాను` అని వివేకానంద ప్ర‌సంగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: