రాగిపిండితో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తాయి.అయితే రాగిపిండితో తరచూ చేసే వంటకాలే కాకుండా దీనితో మనం ఎంతో రుచిగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. రాగిపిండి, ఓట్స్ కలిపి చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఇంకా ఆరోగ్యంగా ఉంటాయి.వీటిని తీసుకోవడం వల్ల రాగులు, ఓట్స్ వల్ల కలిగే ప్రయోజనాలను ఈజీగా పొందవచ్చు. ఈ లడ్డూలను పది నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.బాగా రుచిగా, కమ్మగా ఉండే ఈ రాగి ఓట్స్ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక ఈ రాగి ఓట్స్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..ఓట్స్ – అర కప్పు, నెయ్యి -అర కప్పు, జీడిపప్పు – కొద్దిగా, రాగిపిండి – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు తీసుకోవాలి.
రాగి ఓట్స్ లడ్డూ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు కళాయిలో ఓట్స్ ను వేసి దోరగా వేయించాలి. ఆ తరువాత ఈ ఓట్స్ ను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి కాసేపు వేడి చేయాలి.ఆ నెయ్యి వేడయ్యాక జీడిపప్పును వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత అదే నెయ్యిలో రాగిపిండి కూడా వేసి వేయించాలి. తరువాత ఈ పిండిని కలుపుతూ పచ్చి వాసన పోయే దాకా వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న ఓట్స్ పొడి వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని 3 నుండి 4 నిమిషాల పాటు వేయించిన తరువాత బెల్లం తురుము వేసి కలపాలి.ఇక బెల్లం తురుము కొద్దిగా మెత్తబడిన తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.ఆ తరువాత ఇందులో వేయించిన జీడిపప్పు వేసి అంతా బాగా కలిసేలా చేత్తో బాగా కలపాలి. ఆ తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా రాగిపిండిని తీసుకుంటూ వాటిని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే రాగి ఓట్స్ లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూలను తినడం వల్ల మనం రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పిల్లలకు ఈ లడ్డూలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల కూడా చాలా చక్కగా ఉంటుంది.