కరోనాపై సంచలన విషయాలు వెల్లడించిన అమెరికా సైంటిస్టులు.. ఏంటంటే..!

MOHAN BABU
శని పట్టుకుంటే ఏడేళ్లు వదలదు. గ్రహాలు జాతకాలు నమ్మేవారి నోటినుంచి మనం ఈ మాట వింటూ ఉంటాం. ఇది నిజమో కాదో తెలియదు కానీ, ప్రపంచానికి శనిలా దాపురించిందని అందరూ భావిస్తున్న కరోనా మాత్రం ఒక్క సారి మనిషిని  పట్టుకుంటే ఏడు నెలల దాకా వదలదు. శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి మరి తేల్చిన నిజం ఇది. ఓమిక్రాన్ తో ప్రపంచమంతా వణుకుతున్న వేళ.. ఈ అధ్యయనం వివరాలు వెల్లడించడం ద్వారా ప్రజలు వైరస్ బారిన పడకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేశారు సైంటిస్టులు. కరోనా బారిన పడ్డవారు తీవ్ర అనారోగ్యానికి గురైతే తప్ప సాధారణ రోగులు 15 నుంచి నెల రోజుల పాటు కోలుకుంటారు. 14 రోజుల తర్వాత అసలు శరీరంలో వైరస్ ఉండదు. రెండు వారాల తర్వాత రోగి నుంచి మరొకరికి వైరస్ వ్యాపించ లేదు. ఏడాదిన్నరగా కరోనా నుంచి మనం వింటున్న వార్తలివి. కానీ అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఒక్కసారి వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 7నెలల పాటు తిష్ట వేస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

 ముఖ్యంగా మెదడులో కి చేరిన తర్వాత వైరస్ అక్కడి నుంచి నెలల తరబడి కదలటం లేదని తేల్చారు. మొత్తంగా శరీరంలో రెండు వందల ముప్పై రోజులు పాటు వైరస్ మకాం వేస్తుందని  వెల్లడించారు. కరోనా బారినపడి కోలుకున్నవారు, వైరస్ తీవ్రతతో మరణించినవారి నుంచి సేకరించిన శాంపిళ్లను విస్తృత అధ్యయనం చేస్తున్న తర్వాత శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. ముక్కు ద్వారానో, నోటి ద్వారానే శరీరంలోకి ప్రవేశించే కరోనా రోజుల వ్యవధిలోనే గుండె, మెదడుతో పాటు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి ఆ అవయవాలను తాత్కాలిక నివాసంగా మార్చుకుంటుంది. శ్వాసకోశ అవయవాల్లోనే కాకుండా, మనిషి శరీరంలోని అన్ని కణాలకు చేరుకోగల శక్తి వైరస్ కు ఉందని వెల్లడించారు. మనిషి శరీరంపై వైరస్ ఎంత తీవ్రంగా దాడి చేస్తుందనే దానితో సంబంధం లేకుండా కరోనా ఒంట్లో తిష్ట వేస్తుంది. వైరస్ తో ఎక్కువకాలం బాధపడిన వారిలోనూ,లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలోనూ, స్వల్ప లక్షణాలు ఉన్న వారిలోనూ వైరస్ నెలలపాటు నిలిచిపోతోంది.

కరోనా ప్రాణాంతకంగా మారిన వారితో పాటు, అమెరికాలో తొలి వేవ్ లో వైరస్ తో మరణించిన వారిలో 44 మంది నుంచి కణాలు సేకరించి ఈ విశ్లేషణ జరిపారు. వైరస్ నేరుగా గుండె సంబంధిత కండరాల కణాలపై దాడి చేసినప్పుడు బాధితులు తర్వాత కాలంలో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు సైంటిస్టులు. శ్వాసకోశ వ్యవస్థకు, వెలుపలకు వైరస్ చేరడం రోగనిరోధక వ్యవస్థ బలహీన పడిందనడానికి నిదర్శనమని తెలిపారు. మొత్తంగా కోవిడ్ గురించి వెల్లడైన కొత్త నిజాలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: