కోవిడ్-19 రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. అగ్రదేశం, పేద దేశం తేడాల్లేకుండా లక్షల మందిని పొట్టన పెట్టుకున్న మహమ్మారి ఇది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వాలకు లాక్‌డౌన్‌లు పెట్టక తప్పని పరిస్థితి సృష్టించి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బ తీసిన పెను ఉత్పాతం ఇది. మన దేశంలో కూడా వ్యాపారాలు దెబ్బతినడం మాత్రమే కాకుండా ఎన్నో కుటుంబాల పరిస్థితిని దయనీయంగా మార్చిందిది. అసలు దీని పుట్టుకకు కారణంగా భావిస్తున్న చైనాలో మాత్రం మొదట్లో కొద్ది నెలలు మినహా దీని ప్రభావాన్ని, వ్యాప్తిని సమర్థంగానే నిలువరించగలిగారు. అయితే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వివిధ వేరియంట్ల రూపంలో తన ఉనికిని చాటుతూ భయపెడుతూనే ఉంది. తాజాగా పలు
యూరోపియన్ దీని కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ఉధృతంగా వ్యాపిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది కోవిడ్ అంతకుముందు వేరియంట్ల కంటే పలురెట్లు వేగంగా వ్యాపిస్తుందంటూ నిపుణులు వెల్లడించిన విషయాలతో మరోసారి ప్రపంచం భయం గుప్పిట్లోకి చేరిపోతోంది. అయితే ఈ వేరియంట్ కారణంగా మరణాల సంఖ్య మాత్రమే చాలా తక్కువగా ఉండటం పెద్ద ఊరటేనని చెప్పాలి. ఇదిలా ఉండగా అసలు ఇదంతా కోవిడ్ పేరుతో లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న బడా ఫార్మా కంపెనీల ప్రచారం మాయాజాలమేనని, నిజానికి దీనివలన అంత ప్రమాదం ఏమీ లేదన్న వాదనలు కూడా విస్తృతంగా ఉన్నాయి.
దీంతో అసలు వాస్తవ పరిస్థితేమిటో అర్థంకాని అయోమయ పరిస్థితిలో జనం ఉన్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికీ డెల్టా వేరియంట్ ఉరుముతూనే ఉంది. గడచిన వారం రోజుల్లో అక్కడ 8.5 లక్షలకు మించి కేసులు నమోదు కాగా దీనికారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 8,500కు పైమాటే. అంటే వైరస్ సోకినవారిలో ఒక శాతం అన్నమాట. అంతకుముందు వారం కూడా ఇదే పరిస్థితి ఉందక్కడ. గత నెలతో పోల్చితే ఇది చాలా ఎక్కవ. సగటున రోజుకు 60 వేలమంది కోవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో మన దేశంలోనూ ముప్పు ముంచుకొచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇప్పటికీ వ్యాక్సిన్లు తీసుకోనివారుంటే ఖచ్చితంగా తీసుకోవడం ద్వారా సాధ్యమైనంతవరకు రక్షణ పొందే అవకాశముంది. ప్రభుత్వం కూడా బూస్టర్ డోసులను అందించడం, అవకాశం ఉన్నవారంతా ప్రభుత్వం వేసేదాకా చూడకుండా ప్రైవేటుగా వేయించుకునేలా పిలుపునివ్వడం వంటి చర్యలు తీసుకుంటే మంచిదని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.