ప్రభుత్వాసుపత్రిలో వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత..!

MOHAN BABU
ఒక పథకం అయిపోగానే మరో పథకం. ఒక టీకా కార్యక్రమం అయిపోగానే మరో టీకా కార్యక్రమం. విరామం లేకుండా వచ్చి పడుతున్న పనులతో ప్రభుత్వాస్పత్రిలో నర్సులు  సతమతమవుతున్నారు. ఎంతసేపు అధికారులు టార్గెట్లు విధిస్తున్నారే గాని  క్షేత్ర స్థాయిలో నర్సుల ఇక్కట్లను మాత్రం పట్టించుకోవడం లేదు. మంత్రి, ఉన్నతాధికారులు, జిల్లా, మండల అధికారులు ఇలా ప్రతి ఒక్కరు ఆదేశించే వారే.. వాటి అమలులో చేపట్టాల్సిన చర్యలను మాత్రం విస్మరిస్తున్నారు.


 ఆసుపత్రిలో పనిచేసేందుకే నర్సుల కొరత వెంటాడుతుండగా కొత్తగా టీకా కార్యక్రమాలు వచ్చి ఊపిరాడకుండా చేస్తున్న పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఆయా పథకాల అమలు కోసం నాలుగు వేల మందికి పైగా సెకండ్ ఏఎన్ఎం లతోపాటు ఏఎన్ఎం, యూరోపియన్ ఏఎన్ఎం, హెచ్ఆర్ డి ఏఎన్ఎం.. ఇలా రకరకాల పేర్లతో కాంట్రాక్టు ప్రాతిపదికన 6 వేల మంది వరకు పని చేస్తున్నారు. రాష్ట్ర విభజన నాటికి ఉన్న బెడ్ల సంఖ్యతో పాటు ఐసియు వంటి కీలక విభాగాల సంఖ్య పెరిగింది. ఇప్పటికీ మంజూరైన పోస్టులనే పూర్తిగా భర్తీ చేయకపోగా , పెరిగిన బెడ్ లకు తోడు ప్రభుత్వాసుపత్రుల్లో 15 వేల నుంచి 20 వేల మంది వరకు నర్సులు అవసరం అవుతారని వైద్యరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఎన్ సిడి, క్షయ తదితర పథకాల్లో పని చేయగా, ప్రస్తుతం కరోన వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. దీనికితోడు త్వరలోనే చిన్నపిల్లల వ్యాక్సిన్ ఇస్తామని అధికారులు ప్రకటించారు. జనవరిలో పల్స్ పోలియో ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సు లతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేసే నర్సుల సంఖ్యను డిమాండ్ కు తగ్గినట్టు పెంచాల్సిన అవసరముందనే డిమాండ్ వస్తుంది. సిబ్బంది తక్కువగా ఉండడం, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రభుత్వం సరిగ్గా చేపట్టకపోవడంతో వ్యాక్సినేషన్ వద్ద ప్రజలు సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: