పోషకాహార లోపంతో ఇంతమంది పిల్లలు బాధపడుతున్నారా..?
గుర్తించిన కొన్ని కారణాలు విస్మరిస్తున్న బాధ్యతలు:
సుమారుగా గత రెండు సంవత్సరాలుగా దేశంలో కరోనా విలయతాండవం చేసిన సందర్భంగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోవడంతో పాటు అల్పాదాయ వర్గాలు, సంచార జీవితం గడిపే వారు ,వలస కార్మికులు, దారిద్ర్యరేఖ దిగువన జీవిస్తున్నవారు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం కరోనాను తట్టుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడo ప్రధానమని చెప్పినప్పటికీ అందుకు సంబంధించిన పోషకాహారాన్ని ప్రజలకు కానీ పిల్లలకు గాని అందించని కారణంగా చిన్నారులపై ఆ ప్రభావం ఎక్కువగా పడింది. కరోనా దుష్ప్రభావము గత దశాబ్ద కాలంగా పిల్లల ఆరోగ్యం లో సాధించిన ప్రగతిని తుడిచిపెట్టుకుపోయిందని "చైల్డ్ రైట్స్ అండ్ యు" అనే సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.
కరోనా కారణంగా అంగన్వాడీ కేంద్రాలు సరిగా పనిచేయకపోవడం ప్రభుత్వ పాఠశాలలు పనిచేయని కారణంగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేయడం వలన కూడా పేద బాలల పైన ఈ దుష్ప్రభావం పడిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నప్పటికీ మధ్యాహ్న భోజనంలో ఇస్తున్న టువంటి పోషకాహారం కూడా నామ మాత్రమే అన్న విషయం మనకందరికీ తెలిసినదే.ప్రధానంగా కుటుంబాల ఆదాయాన్ని పెంచడం ,పోషకాహారాన్ని పేద కుటుంబాలకు అందుబాటులో ఉంచడం, అర్హులైన పిల్లలకు పోషకాహారాన్ని ప్రత్యేకంగా ప్రభుత్వం సరఫరా చేయడం, కల్తీలు విషపూరిత రసాయన పదార్థాల వాడకాన్ని తగ్గించడం కూడా పోషకాహారాన్ని సప్లై చేయడానికి వీలుపడుతుంది. ఆహారపదార్థాల దిగుబడిని పెంచుకోవాలి అనే తపన తో అనేక అక్రమాలకు పాల్పడుతున్న అటువంటి కొన్ని కంపెనీలు, రసాయనిక పదార్థాల సంస్థల వలన ఆహారం కలుషితం కావడమే కాకుండా పోషకాహారం అందక పోవడం పట్ల ప్రభుత్వము, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రస్తుత తరుణంలో ఎంతగానో ఉన్నది. ఈ అప్రమత్తత కేవలం చిన్నారులలో లోపాన్ని సవరించడానికి మాత్రమే కాదు పెద్దల లోను కనిపిస్తున్న అశక్తత, అనారోగ్యాలను నివారించడానికి కూడా తోడ్పడుతుంది.