దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఏడాది క్రితం వచ్చిన కరోనా మహమ్మారి ఇప్పటికీ విడిచిపెట్టడం లేదు. దేశంలో కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కారణంగా సాధారణ ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు సెలబ్రెటీలు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పలువురు నటీనటులు కరోనాతో మృతి చెందగా మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మహరాష్ట్ర లో ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో మహరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటి వరకూ దేశంలో మొత్తం పన్నెండు మిలియన్లకు పైగా కేసులు నమోదయ్యాయి. 163 వేల మంది వరకు కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు. ఇక కరోనా కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానం లో ఉండగా కేరళ రెండవ స్థానంలో ఉంది. అంతే కాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కరోనాకు వ్యాక్సిన్ రావడం కొంతవరకు ఊరటనిచ్చే విషయమే అయినా వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కొంత మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా కరోనా విషయంలో చైనా గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ ను నిర్వీర్యం చేసే పరికరాన్ని కనిపెట్టినట్టు వెల్లడించింది. ఈ పరికరం ద్వారా కరోనా వైరస్ ను నిర్వీర్యం చేసి కరోనా నుండి రక్షించవచ్చని తెలిపింది. ఎలక్ట్రాన్ బీమ్ ఇర్రేడియేషన్ ప్రక్రియతో ఈ పరికరం పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే ట్రయల్స్ నిర్వహించగా సక్సెస్ అయ్యాయని తెలిపారు. చైనా జనరల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ తిృంగువా యూనివర్సిటీ చైనాస్ క్లినికల్ రీసెర్చ్ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టులో పాల్గొన్నాయి. వైరస్ ను చచ్చుబడేలా చేసి ఇన్ యాక్టివ్ గా ఈ పరికరం మారుస్తుంది. దీంతో వైరస్ మనిషికి హానిచేయకుండా అయ్యి రోగాల బారిన పడరు.