బరువు తగ్గడంలో మగవారే ముందుంటారు ఎందుకు..?

Deekshitha Reddy
బరువు పెరగడం అనే సమస్య ఆడవారు, మగవారు ఇద్దరిలో ఉంటుంది. కానీ బరువు తగ్గే ప్రయత్నాల్లో ఎప్పుడు మగవారే ఎక్కువగా సక్సెస్ అవుతుంటారు. మహిళలు మాత్రం ఎక్కువగా ప్రయత్నం చేసినా, తక్కువగానే ఫలితం పొందుతుంటారు. దీనికి కారణం ఏంటి..?
మహిళలు సాధారణంగా.. చాలా త్వరగా బరువు పెరిగినట్టు కనిపిస్తారు. అందుకే వారు కాస్త బరువు పెరిగినా వెంటనే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. టీనేజ్ లో అమ్మాయిలు బరువు తగ్గే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు కానీ, 25 దాటిన తర్వాత మహిళలు బరువు తగ్గే ప్రయత్నాలు చేసినా మగవారి లాగా ఆ స్థాయిలో సక్సెస్ కాలేరు అని చెబుతున్నారు నిపుణులు. దీనికి చాలా కారణాలున్నాయి.
మగవారితో పోల్చి చూస్తే ఆడవారిలో టెస్టో స్టిరాన్ అనే హార్మోను కాస్త తక్కువగా ఉంటుంది. ఈ హార్మోను బరువు తగ్గటంలో సహాయపడుతుంది. మగవారిలో ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వారు త్వరగా బరువు తగ్గుతారు. ఆడవారిలో ఇది తక్కువగా ఉంటుంది కాబట్టి.. వారు త్వరగా బరువు తగ్గలేరు. ఇక మగవారిలో కూడా కొంతమందిలో టెస్టోస్టిరాన్ తక్కువగా ఉంటుంది. అలాంటివారు టెస్టో స్టిరాన్ రీప్లేస్ మెంట్ ఇంజక్షన్లు చేయించుకుంటారు. వారిలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపించింది.
ఇక మగవారిలో పొట్ట పై భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. ఆ కొవ్వు కరగడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మహిళలకు మాత్రం నడుము నుంచి కింది భాగాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. ఇక్కడ పేరుకున్న కొవ్వు కరగడం చాలా కష్టం. అందుకే ఆడవారు బరువు తగ్గేందుకు చేసే ప్రయత్నాలు చాలా వరకు విఫలమవుతుంటాయి. అదే సమయంలో మగవారు మాత్రం బరువు తగ్గేందుకుప ప్రయత్నిస్తే చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారు.
మహిళలలో వివిధ కారణాల వల్ల హార్మోన్లలో హెచ్చుతగ్గులు కనపడుతుంటాయి. ఇలాంటి హెచ్చు తగ్గుల వల్ల వారు బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలు అంత త్వరగా ఫలించవు. హార్మోన్ల అసమతుల్యం వల్ల ఎక్కువగా ఆడవారు బరువు తగ్గేందుకు చేసే ప్రయత్నాల్లో విఫలం అవుతుంటారు. ఇది కూడా ప్రధాన కారణం అంటున్నారూ నిపుణులు. అందుకే ఆడవారు బరువు పెరుగుతున్న విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఒకసారి బరువు పెరిగిపోతే తగ్గడం కష్టం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: