మామిడి పండ్ల రంగు చూసి మోసపోతున్నారా.. ప్రాణాలే పోతాయి జాగ్రత్త !

VAMSI
వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల హవా మొదలవుతుంది. అయితే మామిడి పండ్లను విక్రయించే సమయంలో కొనుగోలు దారులను ఆకర్షించి అధిక లాభాలు పొందేందుకు చేసే ప్రయత్నంలో ప్రజల్ని అనారోగ్య పాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో సుమారు 6 వేల హెక్టార్లల్లో, ఎన్‌టీఆర్‌ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. కాగా మొదటి కాపులో హెక్టారుకు దగ్గర దగ్గర 6 టన్నులకు పైగా దిగుబడి రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల దిగుబడి 4 టన్నులకు తగ్గింది. అయితే ముందుగా అంది వచ్చిన కాయలను కొనుగోలు చేసి వాటిని కృత్రిమంగా పండించి విక్రయిస్తే లాభాలు ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో కొందరు వ్యాపారస్తులు మామిడి కాయలను కృత్రిమంగా పండించి నిగనిగలాడేలా చేసేందుకు ప్రమాదకరమైన రసాయనాలు వినియోగిస్తున్నారు.
చాలా చోట్ల ఇదే పద్ధతిని పాటిస్తూ అధిక ఆదాయాలను పొందుతున్నారు.  అయితే కొనుగోలు దారులు సైతం తళతళలాడుతున్న మామిడి కాయలను చూసి అట్రాక్ట్ అయి అధిక ధరలు చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు.    
మామిడి కాయలను మాగబెట్టేందుకు సంప్రదాయ విధానమే ఉత్తమం. అంతే కాకుండా కొన్ని నూతన విధానాలు కూడా ఉన్నాయి. కానీ ఇలా పలు రకాల రసాయనాలను వినియోగించి మగ్గించడం వలన ఇవి తిన్న వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. దీని వలన అవయవాలపై తీవ్ర ప్రభావం పడి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు.
మామిడి కాయలను మాగబెట్టేందుకు వ్యాపారులు, రైతులు కాల్షియం కార్బైడ్‌ వాడినట్లయితే దాని నుంచి వెలువడే ఎసిటిలిన్‌ వాయువులో పాస్సిన్‌, అర్సిన్‌ అనే వాయువులు కలిగి ఉండటం వల్ల ఆ పండ్లను తిన్న వారికి క్యాన్సర్‌ సోకే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటువంటి రసాయనాలు వినియోగిస్తూ ప్రజల ప్రాణాలను పనంగా పెడుతున్న వ్యాపారస్తులు, రైతులను గుర్తించి వారికి శిక్షలు విధించాలని ఉద్యానవన అధికారులు చర్యలు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: