లిస్సా వైరస్ తో.. జర జాగర్త..!

Chandrasekhar Reddy
నేడు ప్రముఖ జీవ శాస్త్రవేత్త, రేబిస్ టీకా సృష్టి కర్త లూయిస్ పాశ్చర్ వర్ధంతి సందర్భంగా (సెప్టెంబర్ 28ని) ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ రేబిస్ నియంత్రణ దినోత్సవంగా ప్రకటించినట్టు తెలిసిందే. ఈ సందర్భంగా ఆ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి అంశాలపై జిల్లా ప్రజలలో విస్తృత చైతన్యం తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు అనంతపురం పశుసంవర్ధక శాఖ ఇంచార్జి  డా. వై. సుబ్రహ్మణ్యం, పశుగ్రాస విత్తనోత్పత్తి కేంద్ర ఎడి డా. ఏవీ. రత్నకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పశువైద్యశాలలలో కుక్కలకు ఉచితంగా టీకాలు వేస్తున్నట్టు వారు తెలిపారు. ఇఇందుకోసం 2600 డోసులు అందుబాటులో ఇప్పటికే ఉంచినట్టు వారు తెలిపారు.
రాబ్టో కుటుంబానికి చెందిన లిస్సా వైరస్ వలన రేబిస్ వ్యాధి సోకుతుందని వైద్యులు వివరించారు. పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, ఆవులు, గేదెలు, పందులు, గొర్రెలు, గుర్రాలలో ఈ వైరస్ కనిపిస్తుంది. ఈవ్యాధి సోకినా కుక్క మరో కుక్కను లేదా వేరే జంతువును లేదా మనిషిని కరిసినప్పుడో ఈవ్యాధి సంక్రమిస్తుంది. అయితే మనుషులకు  90 శాతం కుక్కల వలన మాత్రమే ఈ వ్యాధి వచ్చే సూచనలు ఉన్నాయి. కుక్క కాటు వేయగానే శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశించి కండరాలలో వృద్ధి చెంది, న్యూరో మస్కులర్ స్టిండిల్ ద్వారా నాడీ వ్యవస్థకు చేరుతుంది. అక్కడి నుండి మెదడుకు వ్యాపిస్తుంది. శ్వాస దిగ్బంధనం వలన రేబిస్ సోకిన కుక్క మృత్యువాతపడుతుంది.
ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తీవ్రమైన లక్షణాలు(పురియస్ ఫారం), మరొకటి తీవ్రత తక్కువ ఉన్న లక్షణాలు(డంబ్ ఫారం). మొదటి రకం లక్షణాలు ఉన్న కుక్కలు శబ్దాలకు తీవ్రంగా స్పందిస్తుంటాయి. ఇతర జంతువులు,  మనుషులు, చలనం లేని వస్తువులపై అవి దాడి చేస్తూ ఉంటాయి. వాటి నడకలో సమన్వయలోపం, విపరీతంగా అరుస్తుండటం చేస్తుంటాయి. చివరి దశ అంటే  24-48గంటలలోపు పక్షవాతం వచ్చి మరణిస్తాయి. ఇక రెండో రకంలో కుక్కల వెనుక  కాళ్ళు మడత పడుతుంటాయి. తరచుగా తోక ఒకవైపుకు ఒరిగి ఉంటుంది. శబ్దాలకు తక్కువగా స్పందిస్తూ, నోటి నుండి జొల్లు కారుస్తూ, ఆవలించినట్టుగా అరుస్తూ ఉంటాయి. ఇవి వారం నుండి నెల రోజులలో మరణిస్తాయి.
కుక్కలకు సరైన సమయంలో టీకాలు వేస్తూ ఉండటం ఒక్కటే ఈ వ్యాధికి నివారణ మార్గం. కుక్క కాటుకు గురైన వారు కుళాయి కింద దెబ్బ ప్రాంతాన్ని ఉంచి నురగ వచ్చే వరకు కార్బొలిక్ లేదా డెటాల్ సబ్బు తో 10-15 సార్లు కడగాలి. గాయం మీద ఐస్ ముక్కలు ఉంచడం వలన వైరస్ కదలికలు నివారించవచ్చు. కుక్క కరిచిన మొదటి రోజు నుండి 3, 7, 14, 28, 90 వ రోజులలో వ్యాధినిరోధక టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: