పంద్రాగస్ట్ నాడు ప్రత్యేక ఆకర్షణగా ఒలింపిక్ ఆటగాళ్లు..?

FARMANULLA SHAIK
స్వాతంత్య్ర దినోత్సవం అనేది మనల్ని, మన చరిత్రతో అనుసంధానించే ఒక అందమైన సందర్భం. మనం పీల్చే స్వేచ్ఛ వాయువుల వెనక ఎంతోమంది ప్రాణదానం ఉంది. మన స్వాతంత్య్ర దినోత్సవాన్ని చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించారు. ఏ దేశమూ స్వాతంత్య్రాన్ని పొందేందుకు మన భరతమాత పడినంత వేదనను పడలేదు. ఎంతోమంది భరతమాత బిడ్డలు తమ ఆయువును త్యాగం చేసి భరతమాతకు స్వేచ్ఛను అందించారు. ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్న ప్రతిసారీ ఆ త్యాగధనులను అందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే.ఈ నేపథ్యంలో 78వ‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ హైఅలర్ట్ ప్రకటించారు. దేశ రాజధానిలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, పార్లమెంట్, ఇండియా గేట్, ఐజిఐ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లు, మాల్స్, మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో కేంద్ర బలగాల‌తో భ‌ద్ర‌త‌ను ప‌టిష్ఠం చేశారు. ఆగస్టు 15వ తేదీన 11వ సారి ఎర్రకోట పై ప్రధాని న‌రేంద్ర మోదీ జాతీయ ప‌తాకాన్ని ఎగురవేయ‌నున్నారు. వికసిత భారత్ థీమ్ తో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోటలో ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఎర్రకోట పరిసరాల్లో 700 ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 10వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఎర్ర కోటలో వేడుకలకు 20 నుంచి 22 వేల మంది ప్రజలు హాజ‌రుకానున్నారు. వేడుకలకు హాజరయ్యేవారికి క్యూఆర్ స్కానింగ్ కోడ్ పాసులు జారీ చేశారు. స్నైపార్స్, షార్ప్ షూటర్లు, స్వాట్ కమండోలతో ప్రధాని సహా ప్రముఖులకు భద్రత క‌ల్పించ‌నున్నారు.ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నాలుగు వేల మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ప్రత్యేక ఆహ్వానితుల్లో విద్యార్థులు, పేదలు, మహిళలు, రైతులు, యువత, గిరిజనులు, కార్మికులు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్ బృందం కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు. 

పారిస్‌ ఒలింపిక్స్‌ ముగియడంతో ఈ మహా క్రీడా సంగ్రామంలో  పాల్గొనేందుకు వెళ్లిన క్రీడాకారులు తమ తమ దేశాలకు బయలుదేరారు. భారత ఒలింపిక్ ఆటగాళ్ల బృందం కూడా స్వదేశానికి బయలుదేరింది. ఈరోజు  ఢిల్లీ చేరుకుంటుంది. రేపు అంటే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  ఎర్రకోటలో జరిగే వేడుకల్లో భారత ఆటగాళ్ల బృందం పాల్గొంటుంది. ఆ తర్వాత వీరంతా  ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. భారత ఒలింపిక్ బృందం బుధవారం ఉదయం పారిస్ నుంచి ఢిల్లీ చేరుకుంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు  సాయంత్రం 5:30 గంటలకు హై టీ కోసం ఈ ఆటగాళ్లను కలవనున్నారు. ఆగస్టు 15వ తేదీ గురువారం ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ క్రీడాకారులు పాల్గొంటారు. దీని తర్వాత ఆటగాళ్లు ప్రధానమంత్రి అధికారిక నివాసానికి వెళతారు.  ప్రధాని నరేంద్ర మోడీ వీరితో మధ్యాహ్నం 1 గంటలకు ఇక్కడ సమావేశమవుతారు.ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తమ ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఎర్రకోట నుంచి తన ప్రసంగంలో వివరిస్తారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఎర్రకోట నుంచి రోడ్‌మ్యాప్ ను మోదీ ప్రకటిస్తారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సాంకేతిక అభివృద్ధి పై మోదీ ప్రసంగించనున్నారు. ప్రభుత్వ గత విజయాలు , భవిష్యత్తు లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలను వివరిస్తూ స్వాతంత్ర్య సమరయోధులకు మోదీ నివాళులర్పించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: